moral stories in telugu : అనగనగా ఒక ఊళ్ళో సుబుద్ధి, దుర్బుద్ధి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. పేర్లకు తగ్గట్టే సుబుద్ది సత్ప్రవర్తన కలవాడు. దుర్బుద్ది ఎప్పుడూ మోసంతో ధనం ఆర్జించాలనే దుష్ట ఆలోచనలతో ఉండేవాడు.
ఒక రోజు ఇద్దరూ పని మీద పట్నం వెడుతున్నారు. దారిలో వాళ్ళ కాళ్ళ కేదో అడ్డు తగిలి పడబోయారు. ఏమిటబ్బా అని చూస్తే అవి బంగారు నాణాలతో నిండి ఉన్న లంకె బిందెలు. బిందెలని కదిపితే ఖణేల్, ఖణేల్మని ‘ చప్పుడొస్తుంటే, మెరిసి పోతున్న మిసిమిని చూస్తే దుర్బుద్ధి కళ్ళు జిగేల్ జిగేల్మన్నాయి.
సుబుద్ది ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోక ముందే దుర్బుద్ధి “మిత్రమా ! మనం చెరి సగం పంచుకుందాం! ఇక్కడే పాతిపెట్టి రేపు పొద్దున్నే వచ్చి వాటాలేసుకుందాం” అన్నాడు. సరేనని సుబుద్ధితో ఇంటి దోవ పట్టగానే దుర్బుద్ధి ఆ లంకెబిందెలను తీసుకెళ్ళి తన ఇంట్లో పాతిపెట్టి ఏమి ఎరగనట్టు సుబుద్ధితో కలిసి వచ్చి “అయ్యో! మిత్రమా! మన బిందెలు ఏవీ!”అని ఆశ్చర్యం, ఆవేదన నటించి “ఏ సుబుద్ధీ! ఆ బిందెలను నువ్వే కాజేశావు అని గట్టిగా అరుస్తూ రాజు గారికి ఫిర్యాదు చేశాడు.
నాకే పాపం తెలీదు! నేను తీయలేదు రాజా! అని సుబుద్ధి దుఃఖపడ్డాడు. రాజు “సుబుద్ధి తీశాడనటానికి సాక్ష్యా ధారాలు ఉన్నాయా? అని అడిగాడు. దుర్బుద్ధి “ఏ చెట్టు కింద పాతిపెట్టామో ఆ చెట్టే సాక్ష్యం చెబుతుంది. అందరం ఆ చెట్టు దగ్గరికి వెడదాం పదండి రాజా! అని అందర్నీ చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి “వృక్షరాజమా! లంకెబిందెలు ఎవరు దొంగిలించారు” అని అడిగాడు. “సుబుద్ధి! సుబుద్ధి!” అని చెట్టులోంచి మాటలు వినిపించాయి.
సూక్షగ్రాహి అయిన రాజు చెట్టు తొర్ర గడ్డితో కప్పి ఉండటం చూసి మోసాన్ని గ్రహించి సేవకుల చేత ఆ గడ్డికి నిప్పు పెట్టించాడు. తొర్రలో ఉన్న దుర్బుద్ధి తండ్రి “ఓరి నాయనోయ్ ! కొరగాని కొడుకుని కన్నాను. వాడు నా బుద్ది కూడా వక్రమార్గం పట్టించాడు! రక్షించు రాజా!” అని ఏడ్చాడు. రాజు సుబుద్ధికి అతని ధనాన్ని ఇప్పించి. వృద్ధుడిని మందలించి దుర్బుద్ధిని చెరసాలకు పంపించాడు.
నీతి : మోసంతో ఇతరులను మోసం చేయాలనుకొంటే మొదటికే మోసం వస్తుంది.
also read :
Upasana : ఉపాసన డెలివరీ డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Anasuya Latest Saree Stills, Images, Photos 2023
Shruti Haasan : కాళ్లు కమిలిపోయేలా ప్రభాస్ హీరోయిన్ వర్కవుట్స్..