Telugu Flash News

Moral Stories in Telugu : అదృష్టం – దురదృష్టం కథ చదవండి

moral stories in telugu

Moral Stories in Telugu : ఒక గ్రామములో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. ఇద్దరూ చాలా బీదవారు, కాని మంచి పండితులు. వారిలో ఒకడు పుట్టు గుడ్డివాడు. వారున్న ఊర్లో వారిని గౌరవించే ఉన్నత విద్య గలవారు ఎవ్వరూ లేరు.

అందువల్ల వాళ్లిద్దరు ప్రక్క గ్రామానికి వెళ్లి ప్రతి ఇంటిముందు ఆ రోజుటి పంచాంగము చెప్పి యాయ వారములు చేసుకొని జీవించేవారు.

ఇద్దరు మంచి శివభక్తులు. ఒకరోజు పార్వతీపరమేశ్వరులు విహారమునకు పోతూ ఈ ఇద్దరిని చూచినపుడు పార్వతి భర్తను “నాథా వీరిద్దరు మంచి శివభక్తులు మిమ్మల్నే నమ్ముకొని జీవిస్తున్నవారు. ఎపుడు మీ నామస్మరణే చేస్తుంటారు. వీరికి మీరు సర్వ సంపదలను ఎందుకు ఇవ్వరు ?” అని అడిగింది.

అప్పుడు శివుడు నవ్వుతూ “దేవీ! బ్రహ్మ రాతని ఎవ్వరు తప్పించలేరు. అన్నీ బ్రహ్మ వ్రాసిన ప్రకారమే జరుగుతుంటాయి. అదృష్టవంతుడిని చెడగొట్టేవాడు లేడు, అలాగే దురదృష్టవంతుని బాగుచేసేవాడు లేడు కాని త్వరలో గ్రుడ్డివానికి అదృష్టం కలుగబోతోంది సర్వ సంపదలు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం వస్తాయి.

కాని ఈ కళ్లున్న బ్రాహ్మణుడికి దరిద్ర బాధలు తప్పవు” అని అంటాడు. పార్వతీదేవికి భర్త మాటలు నచ్చలేదు. అందుచేత కండ్లు ఉన్న బ్రాహ్మణునికి తానే సహాయం చేయాలనుకుంది. ఎందుకంటే భర్త చెప్పిన ప్రకారం కళ్లులేని బ్రాహ్మణుడికి ఎలాగు సర్వసంపదలు వస్తాయి కదా అని అనుకుంది.

అదృష్ట పరీక్ష

మరునాడు ప్రక్క గ్రామానికి వెళ్లిన ఇద్దరు బ్రాహ్మణులు భిక్షాటన ముగించుకొని తిరిగి తమ ఊరికి వస్తున్నారు. అపుడు దారిలో కళ్లు ఉన్న బ్రాహ్మణుడు వచ్చే దారిలో నగలు, నాణాలు, ఒక చిన్న బండరాయంత బంగారం ముద్ద అన్నీమూట కట్టి అతని దారిలో పడవేసింది.

ఆ బ్రాహ్మణుడు దారిన వస్తూ “రోజు ఈ కళ్లులేని బ్రాహ్మణుడు ఎలా నడుస్తాడో పాపం అనుకొని నేను కళ్లు మూసుకొని ఎంతదూరం నడవగలనో చూస్తాను” అని తలచి కళ్లు మూసుకొని దారిలో ఉన్న బంగారు మూటను దాటి ప్రక్కనుంచి వెళ్ళిపోయినాడు.

అలా దాటి 10 అడుగులు వెళ్లిన తర్వాత ఇంక నడవలేక పోయాడు. కళ్లు తెరచి కళ్లు మూసి నడవడం కష్టం అని అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు.

ఇక కళ్లులేని బ్రాహ్మణుడు కర్రతో నేలమీద తట్టుకొంటూ జాగ్రత్తగా నడుచుకొంటూ వస్తున్న అతనికి దారిలో పార్వతీదేవి పడవేసిన బంగారపు ముద్ద కర్రకు బలంగా తగిలింది.

అపుడు ఆ బ్రాహ్మణుడు “అయ్యో ఎవ్వరో ఈ బండరాయిని దారిలో పడవేశారు ప్రక్కన పెట్టాలి” అనే మంచి హృదయంతో వంగి ఆ బండను తీయబోయాడు.

అలా తీయబోయిన ఆయన చేతికి మూట తగిలింది. ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎవరైనా బండరాయిని మూట కడతారా ? ఇదేదో వింతగా ఉంది అని అనుకొని ఆ బంగారపు ముద్ద ఉన్న మూటను తన జోలెలో వేసుకొని భార్యకు చూపించి, అది ఏమిటో తెలుసుకొనటానికి ఇంటికి తీసుకొని వెళ్లాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత తను తెచ్చిన మూట భార్యకివ్వగా ఆమె ఈవాళ బియ్యము జోలె ఇంతగా బరువు ఎందుకు ఉందని ఆశ్చర్యపోతూ బియ్యాన్ని తీసుకొని డబ్బాలో పోసుకుంది.

ఆ బియ్యము క్రింద ఉన్న బంగారపు ముద్ద ఉన్న మూటను విప్పి చూసింది. ఆమె అపుడు ఆశ్చర్యంతో సంతోషముతో పొంగిపోయింది. ఇంతకాలానికి మనలను దేవుడు కరుణించాడు అని భర్తకు చెప్పి మూటలో ఉన్న విశేషాలను వివరంగా చెప్పింది. ఆ బ్రాహ్మణుడు కూడా సంతోషపడి దైవాన్ని ప్రార్ధించాడు.

ఇదంతా చూచిన పార్వతి తన భర్త మాటలలోని అంతర్యాన్ని అర్థము చేసుకుంది. ఇపుడు నిజంగా అదృష్టం ఇచ్చినా కళ్లు ఉన్న బ్రాహ్మణుడు కళ్లుమూసుకొని అదృష్టాన్ని కోల్పోయాడు.

కళ్లులేని బ్రాహ్మణుడు ఆ అదృష్టాన్ని వరించాడు. దీన్ని బట్టి భర్త చెప్పిన మాటకు ఎంత అర్థం ఉందో గ్రహించింది.

నీతి : అదృష్టవంతుల్ని చెడగొట్టేవాళ్లు లేరు. దురదృష్ట వంతుల్ని బాగు చేసేవాళ్లు లేరు.

also read :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version