Telugu Flash News

moral stories in telugu : ఉపాయముతో ఏ పనినైననూ సాధించవచ్చు

moral stories in telugu

moral stories in telugu : ఒక ఊరిలో ఒక పండిత బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణునికి సంతానము లేదు. సంతానము కోసం పుత్రకామేష్ఠి అనే యాగము చేయాలనుకున్నాడు. ఆ యాగము చేస్తే కొడుకులు పుడతారని ఆయనకు ఊళ్లోని స్వామిజీ చెప్పాడు.

అందువల్ల ప్రక్క గ్రామములో ఉన్న సంతలో ఒక నల్లమేకను యాగముకోసం కొందామని సంతకు వెళ్లి ఒక నల్లమేకను కొన్నాడు. ఆ మేక మెడలో త్రాడు కట్టి మళ్లీ మేకతో సహా ఇంటికి బయలుదేరాడు.సంతలో ఉన్న దొంగలు ఈ మేకను ఎలాగైనా కాజేయాలని దుర్బుద్ధి పుట్టింది.

దొంగల ఉపాయం

ఆ దొంగల్లో మొదటివాడు ఆ బ్రాహ్మడిని ప్రక్క గ్రామానికి వెళుతున్నపుడు ఆ మేకను లాక్కొని పారిపోదాం అంటారు. మనం బలం ముందు బ్రాహ్మడు ఏమి చేయలేడు అని చెప్తాడు. అప్పుడు వారిలో ఒకడు దౌర్జన్యంగా మేకను లాక్కుంటే మనల్ని ప్రజలు పట్టుకొని దేహశుద్ధి చేస్తారు అని చెప్పాడు.

అపుడు రెండో దొంగ అయితే ఇంకొక పనిచేద్దాం, దౌర్జన్యంగా లాక్కున్న తర్వాత ఆ బ్రాహ్మణ్ణి చంపేద్దాం అని అంటాడు.మళ్లీ వారిలో ఒకడు మనం అలా చంపితే రాజుగారి రక్షకభటులు మనల్ని పట్టుకొని రాజ దర్భారులో నిలబెడ్తారు. అపుడు రాజుగారు మనల్ని ఉరి తీయిస్తారు అని అన్నాడు.




అపుడు మూడవవాడు మరయితే ఏమి చేద్దాం అని అనగా నాల్గవదొంగ మనం దౌర్జన్యం లేకుండా ఉపాయంతో మేకను సంపాదించాలి అపుడు మన మీద ఏ నేరం ఉండదు అని చెప్పాడు.

మిగతా దొంగలు ఆ ఉపాయం ఏమిటో చెప్పు అని అడుగగా ఆ తెలివిగల దొంగ, బ్రాహ్మణుడు ఊరికి వెళ్లే దారిలో నిలబెట్టి బ్రాహ్మణుడు వచ్చినపుడు ఎలా మాట్లాడాలో చెప్పాడు. అందరూ ఉపాయము బాగుందని, అలాగే చేద్దామని వాళ్ల పని నిమిత్తం వాళ్లు వెళ్లిపోయారు.

ఏమి తెలియని బ్రాహ్మణుడు ఆయన కొన్న నల్లమేకను తీసికొని సంతలో నుండి బయటకు వచ్చి తన ఊరి వైపుకు బయలుదేరాడు. అపుడు మొదట దొంగ “అయ్యా ! నమస్కారం. మీరు బ్రాహ్మణులు మంచి పండితులు అన్నీ తెలిసినవారు మీరే ఈ నల్లకుక్కని ఇంటికి తీసుకెళుతున్నారు” అని అడిగాడు.

పండితుడు వాడిని కోపంగా చూస్తూ మూర్ఖుడా ! ఇది కుక్కకాదు, మేక నీకు బుద్ధి లేదు, బుద్ధితో పాటు దృష్టికూడా మందగించింది పో ! పో ! అని ముందుకు సాగిపోయాడు.

కొంతదూరం పోయిన తర్వాత రెండవ దొంగ అయ్యా! నమస్కారం తమరు సమస్తం తెలిసిన జ్ఞానమూర్తులు ఈ అసహ్యకరమైనటువంటి నల్లకుక్కను ఇంటికి ఎందుకు తీసుకెళుతున్నారు.  ఇంత పెద్ద కుక్క పెంచుకోవడానికి పనికిరాదు కదా !” అన్నాడు.



మళ్లీ బ్రాహ్మణుడు మండిపడి ఓరోరి ! మూర్ఖుడా ! నీకు మతి భ్రమించింది బుద్ధి పనిచేయటం లేదు ఇది కుక్కలాగ కనిపిస్తుందా ! ఇది కుక్కకాదు మేక. నాకు దారి వదులు” అని ముందుకు వెళ్ళాడు.

అలా కొంతదూరం పోయిన తర్వాత మూడవ దొంగ బ్రాహ్మణుడిని కలిసి “ఏమిటి పంతులు గారు !” హీ హీ హీ అని నవ్వుతూ ఈ మాల కుక్కను తీసుకెళుతున్నారు. దీంతో మీకు పనేంటి” అని ఎగతాళిగా అడిగాడు.

అపుడు బ్రాహ్మడు అరె ఇంతమంది దీన్ని కుక్క అంటారేమిటి ఈ కాపువాడు కూడా పండితుడైన నన్నే ఎగతాళి చేస్తున్నాడు అని అనుకొని దొంగకు ఏమీ సమాధానం చెప్పకుండా అలానే తన ప్రయాణం సాగించాడు. కొంచెం దూరం నడచిన తర్వాత ఆ బ్రాహ్మడి గ్రామం దగ్గర పడుతుంది.


ఇది యాగానికి పనికిరాదు

అపుడు నాల్గవ దొంగ, “అయ్యయ్యో ! ఏమిటి గురువు గారు ! మీరు ఈ మాల కుక్కను స్వయంగా పట్టుకొని ఇంటికి తీసుకెళుతున్నారు ? ఇలా మిమ్మల్ని చూస్తే గ్రామములో మీకు గౌరవం ఏమి ఉంటుంది ? ఇంత పెద్దవారు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారు. ఈ కుక్కతో మీకు ఏమి అవసరం” అని నవ్వాడు. అపుడు బ్రాహ్మణుడు “ఆహా ! నేను ఎంత మోసపోయాను సంతలో ఆ వ్యాపారస్తుడు నన్ను మోసం చేసి మేక బదులు కుక్కను ఇచ్చాడు. లేకపోతే ఇంతమంది మేకని కుక్క అంటారా! కాబట్టి ఇది నిజంగా కుక్క కాబట్టి ఇది యాగానికి పనికిరాదు. పైగా దీన్ని ఊళ్ళోకి తీసుకొనిపోతే నా పరువు ప్రతిష్టలు మంటకలిసి పోతాయి. అందువల్ల దీన్ని ఇక్కడే వదలిపోవడం క్షేమకరం” అని భావించి ఆ మేకను వదిలేసి ఊరి చివరన ఉన్న బావి దగ్గర స్నానం చేసి కుక్కను తాకినందుకు ప్రాయశ్చిత్తం అయినదని సంతోషముతో ఇంటికి వెళ్లిపోతాడు.

నీతి : ఉపాయముతో ఏ పనినైననూ సాధించవచ్చు. కార్యసాధనకు బలం ముఖ్యం కాదు. బుద్ధి ముఖ్యం.

also read:

Pawan Kalyan :బాల‌య్య ప్ర‌శ్న‌కు అదిరిపోయే స‌మాధానం ఇచ్చిన ప‌వ‌న్ .. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా..!

Road Shows Ban In AP : జీవోలు, 30 యాక్ట్ లు ప్రతిపక్షానికేనా.. ప్రభుత్వానికి కాదా ?

Exit mobile version