Telugu Flash News

moral stories in telugu : ఇద్దరు ఇల్లాళ్ళు.. కథ చదవండి

moral stories in telugu

moral stories in telugu : ఒక అగ్రహారంలో పేద బ్రాహ్మణ దంపతులుండేవారు. భర్త పౌరోహిత్యం చేసి దొరికిన డబ్బుతో సంసారరధాన్ని ఈడ్చుకొస్తున్నాడు. మామగారి తద్దినం కోసం ఆ ఇల్లాలు ముడి నువ్వులు నానబోసి, దంచి పొట్టు తీసి తడి ఆరటానికి ఎండ పెట్టింది. ఒక కోడి ఒక్క దూకున వచ్చి గబగబ తినటం మొదలు పెట్టింది. పురుగులను తినే కోడి ముట్టుకోవటంతో ‘ఆ తిలలు శ్రాద్ధ కర్మకు పనికిరావు పారబొయ్యి అన్నాడు బ్రాహ్మడు.

అసలే పేదరికం అంత పెద్ద డబ్బు లేదు అన్నాడు అంత నువ్వు పప్పు పార బోయటం ఇష్టంలేక తెలివిగా ఆమె పక్కింటికి వెళ్ళి ఆ ఇల్లాలు “అమ్మా! ఈ నువ్వు పప్పు తీసుకొని ముడి నువ్వులు ఇయ్యవా! అంది.ఆ గృహిణి ‘పడితే బూరెల గంపలో పడాలి, అన్నట్టుంది. నాకు దంచే బాధ పొట్టు తీసే బాధ తప్పుతోంది! తెలివి తక్కువ ఇల్లాలు! నువ్వుపప్పు తీసుకుని ముడి నువ్వులు ఇవ్వమని” బతిమాలు తోంది అని నవ్వుకొని ఇంట్లోని ముడినువ్వులు తెచ్చి తేటగా తెల్లగా ఉన్న నువ్వుపప్పుని తీసుకుని లోపల పెట్టింది.

భర్త ఇంటికి రాగానే జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పి భర్త మెచ్చు కుంటాడని ఎంతో ఆశతో ఎదురు చూసింది.“ఇదిగో చూడు భార్యామణి! నీళ్ళల్లో నానబోసి చేతులు కందేలా దంచి, చెమట ఓడ్చికుంటూ చెరిగి పొట్టు తీసిన చాయ నువ్వు పప్పుని ఇచ్చి ముడి నువ్వులు పట్టుకెళ్ళటంలోని ఆంతర్యం నీకు బోధపడలేదా! ఆ గృహిణి చాలా తెలివిగలది. చెత్తకుప్పలో పారబోయవలసిన నువ్వులు నీకు తీసుకొచ్చి అంటగట్టింది.

ఆ నువ్వు పప్పులో ఏదో దోషం ఉంది. లేకపోతే అది తెచ్చి నీకెందుకు ఇస్తుంది ఆలోచించు.” అన్నాడు. అప్పుడామె “అవునండి నేనంత దూరం ఆలోచించలేదు. మీ దూరాలోచన ముందు ఆమె దురాలోచన ఓడింది. ఇది మడికి పనికిరాదని నాకు అంటగట్టింది. మడిదడి అక్కర్లేని పనిపిల్లకిచ్చేస్తాను. మంచి గుణపాఠం నేర్పింది. మహాతల్లి!” అంది, దంచిన సరుకు ఇచ్చి ముడి సరుకు తీసుకున్న ఆమె కిటుకు గ్రహించిన గృహిణి.

నీతి: ఎవరూ ఊరికే తమ శ్రమను ఇతరులకు ధారపోయరు.
also read :

Niharika: ఆ రెండు ఫొటోలు మిన‌హా భ‌ర్త జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేసిన నిహారిక‌.. ఏం జ‌రుగుతుంది..!

Horoscope (11-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Diabetes : డయాబెటిస్ ఉన్న వారు ఉదయాన్నే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ?

 

Exit mobile version