Moral Stories in Telugu : అనగనగా ఒక గ్రామంలో ఒక జమిందారు ఉండేవాడు. ఆయనకు దైవభక్తి ఎక్కువ. సాధువుల పట్ల ఎంతో భక్తితో ఉండేవాడు. గ్రామం దగ్గరిలోనే సాధువుల కొరకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేశాడు. ఒకసారి ఒక సాధువు వచ్చి ఆ ఆశ్రమంలో ఉన్నాడు. జమిందారు ఆయనకు ఏలోటూ లేకుండా సేవ చేయటానికి సేవకులను నియమించాడు.
ఒకరోజు జమిందారు ఆ సాధువు దర్శనానికి వెళ్ళాడు. ఆయన్ని కుశలమడిగి తెలుసుకున్నాడు. తరువాత తన మనసులో మాట చెప్పాడు.
“స్వామీజీ నా ఇంట చాలా ధనం ఉంది. కానీ రక్షణ కరువయ్యింది. అందువల్ల కొంతధనాన్ని మూట గట్టి తెచ్చాను. దీన్ని ఆశ్రమంలో పాతిపెట్టి ఉంచండి. అవసరమైనప్పుడు తీసుకు వెళ్తాను” అన్నాడు.
“మీ ధనం మీ ఇష్టం. సాధవులం. మాకు వాటి పట్ల దృష్టి ఉండదు” అన్నాడు స్వామీజీ.
కొద్ది రోజుల తరువాత స్వామీజీకి దురాలోచన వచ్చింది. జవతపాలతో ప్రయోజనం లేదు. ఆ ధనంతో అన్నీ అనుభవించవచ్చని అనుకున్నాడు. వెంటనే గొయ్యితవ్వి డబ్బు మూటను తీసి మరోచోట దాచాడు.
మరునాడు జమిందారు దగ్గరకు వెళ్లి “శిష్యా ! ఇక నేను వెళ్ళిపోతాను. సాధువులం కనుక ఒకే ప్రాంతంలో ఉండలేం” అన్నాడు.
“అయ్యో! స్వామీ! మా సేవల్లో ఏమైనా పొరపాట్లుంటే క్షమించండి. కొద్దికాలం ఉంటే మాకు తృప్తిగా ఉంటుంది” అని జమిందారు వేడుకున్నాడు.
“లేదు నాయనా ! మీ సేవలకు ఎంతో ఆనందించాను. సాధువులం రోటికి కట్టినట్లు ఉండరాదు కదా” అని వెళ్ళిపో యాడు. మరికొద్ది సేపటికి తిరిగి వచ్చి “నాయనా ! పొరపాటున ఈ పూచికపుల్ల నెత్తి మీద పడింది. నీధి నేను తీసుకోరాదు” అని చెప్పి వెళ్ళాడు.
సాధువు ధర్మబుద్ధికి జమిందారు ఎంతో సంతోషించాడు. కానీ ఆయన దగ్గరున్న స్నేహితులకు అనుమానం వచ్చింది. “ఈ సాధువు నాటకాలాడుతున్నాడు” అని అన్నారు.
ఎందుకయినా మంచిదని ఆశ్రమంలో దాచిన ధనం మూట చూడ్డానికి ఒకరిద్దరిని పంపించారు. తీరా తవ్వి చూస్తే అందులో ఏమీలేదు. పరుగున వచ్చివారు ఆ సంగతి జమిందారుకు చెప్పారు.
“దొంగస్వామి ఎంతో దూరం వెళ్ళి ఉండడు. వెళ్ళి పట్టు కోండి” అని ఆదేశించాడు.
వాళ్ళు ఎలాగో ఆ స్వామిని పట్టుకొని జమిందారు దగ్గరకి తీసుకు వచ్చారు.
నువ్వేదో మహాత్ముడివి అనుకున్నాను. నా సొమ్మేది అని అడిగాడు జమిందారు.
“ఏం సొమ్ము నాయనా ?” అంటూ సాధువు నటించాడు.
“ఆ మూటలో ఏముంది ?” అని సాధువు దగ్గర ఉన్న సంచిని పరీక్షించాడు. దొంగ సాధువు మోసం బయటపడింది.
నీతి : ముందువెనుక ఆలోచించకుండ అపరిచితులకు ఆశ్రయం ఇవ్వరాదు. వారికి మన రహస్యాలు చెప్పకూడదు.
also read news:
Carrot Capsicum Rice : క్యారెట్ క్యాప్సికం రైస్.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది ..