Moral Stories in Telugu : ఒకసారి ఒక గద్ద ప్రమాదంలో చిక్కుకుంటే ఒక గుడ్లగూబ దానిని రక్షించింది. తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా గద్ద “నీ పిల్లలకు నేను హాని చెయ్యను. కానీ నీ పిల్లలను ఎలా గుర్తు పట్టాలో చెప్పు” అని గుడ్లగూబను అడిగింది.
అందుకు గుడ్లగూబ “చాలా సంతోషం. నా పిల్లల్ని తేలికగా గుర్తుపట్టవచ్చు” అంది.
“ఎలా ?” అడిగింది గద్ద.
“అవి చాలా ముద్దుగా, అందంగా చూడముచ్చటగా ఉంటాయి. వాటిని చూస్తే నువ్వు కూడా ఇట్టే గుర్తు పట్టేయ గలవులే” అంది గర్వంగా.
“అంత అందంగా ఉంటాయా నీపిల్లలు” అని అడిగింది గద్ద.
“అబ్బో! అసలంత అందమయినవి నీకు ఎక్కడా కని పించవు కూడా” అంది మళ్ళీ గుడ్లగూబ..
అయితే నాకటువంటి అందమైన పిల్లలు కనిపిస్తే అవి నీవే అనుకొని తినకుండా వదిలేస్తాను. సరేనా ?” అని గద్ద వెళ్ళిపోయింది.
గుడ్లగూబ కూడా తన దారిన వెళ్ళిపోయింది.
కొంతకాలం తరువాత, గద్ద ఎగురుతుండగా దానికి ఒక చెట్టుతొర్రలో పక్షిపిల్లలు కనిపించాయి. అది ఆ పిల్లల దగ్గరకి వచ్చింది. ఆ పిల్లలు వచ్చీరాని ఈకలతో, పెద్ద పెద్ద నోళ్ళతో అసహ్యంగా కనిపించాయి.
“ఇంత అసహ్యంగా ఉన్నాయి. కాబట్టి ఇవి నన్ను రక్షించిన గుడ్లగూబ పిల్లలు కాకపోవచ్చు” అనుకుని వాటిని తినేసి వెళ్ళి పోయింది.
కొంతసేపటి తరువాత గుడ్లగూబ వచ్చి చూసుకుంటే పిల్లలు లేవు. అక్కడ రక్తం మరకలు చూసి, ఎవరో తన పిల్లల్ని తినేశారని అనుకుంది. ఆ విషయం గద్దకు చెబుతామని, దాన్ని వెదికి చెప్పింది. “అరే! ఆ పిల్లలు నీవా ? వాటిని తినేసింది నేనే” అంది గద్ద. “నా పిల్లల్ని తిననని మాటిచ్చావుగా ?” అంది గుడ్లగూబ.
“నీ పిల్లలు చాలా అందంగా ఉంటాయన్నావు కదా. మరి అవి అలా లేవు. కాబట్టి అవి నీ పిల్లలు కాదనుకొని తిన్నాను” అంది గద్ద. “తన బిడ్డలు ఎలా ఉన్నా తల్లికంటికి అందంగానే కనిపిస్తారు. అలాగే తల్లి ఎప్పుడూ పిల్లల అభివృద్ధినే కాంక్షిస్తుంది. అందుకే తల్లి మనసు ఎరిగి ఆమె ఎప్పుడు ఏది చెప్పినా పాటించమని పెద్దలు చెబుతుంటారు.
నీతి : కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి సంతానం వారి దృష్టిలో అందమైనవే.
also read news:
Pakistan: ఇంగ్లండ్ టీం ఉన్న హోటల్ సమీపంలో కాల్పులు.. ఇక భారత్ టూర్ పూర్తిగా రద్దు..!