moral stories in telugu : ఒక గ్రామములో మల్లయ్య టోపీలు కుట్టుకొని ఇరుగు పొరుగు గ్రామాలకు వెళ్లి వాటిని అమ్మి వచ్చిన దాంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. సంవత్సరం పొడవునా ఇదే వ్యాపారం చేసేవాడు. యధాప్రకారంగా వేసవి కాలంలో కూడా ఒకరోజు టోపీలతో బయలుదేరాడు మల్లయ్య.
ఎండ ఎక్కువగా ఉండడంతో ఇంతవరకు అమ్మినవి చాలు కొద్దిసేపు ఈ చెట్టు క్రింద విశ్రమించి, సేద తీర్చుకొన్న తర్వాత తిరిగి అమ్ముదాము అని మనసులో అనుకొని తన నెత్తిమీద ఉన్న టోపితో చెట్టుకు ఆనుకొని టోపీల బుట్టను అతనికి ప్రక్కగా పెట్టుకొని నిద్రలోకి జారుకొన్నాడు.
మల్లయ్య ఏ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకొన్నాడో ఆ చెట్టుమీదనే చాలా కోతులు కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా అతను గమనించలేదు. ఈ కోతులు మాత్రం నిద్రించువాని తలపై ఉన్న టోపిని చూచి, చెట్టుపైనుండి క్రిందకు దిగివచ్చి ఆ బుట్టలోని టోపీలనన్నింటిని ఒక్కొక్క కోతి ఒక్కొక్కటి తీసుకొని మల్లయ్యలాగే నెత్తిన పెట్టుకొని గంతులు వేస్తూ అరుస్తూ కేరింతలు కొట్టసాగాయి.
ఈ గంతుల, కేరింతల శబ్ధానికి మల్లయ్యకు మెలకువ వచ్చి చూడగా బుట్టలో టోపీలు లేవు. ప్రతి కోతి తలమీద తన లాగే ఉండడం గమనించాడు. ఏమి చేయాలో అతనికి తోచడం లేదు, ఆలోచిస్తున్నాడు. పరిస్థితి అర్థం కావడం లేదు. ఎలా వస్తాయి ఆ టోపీలు తన మనసునిండా ఇదే ఆలోచన.
సమయం గడుస్తున్నది.. అప్పుడు మల్లయ్య కి ఒక ఆలోచన తట్టింది. తనలాగే కోతి చేస్తుండటం గమనించి.. తన నెత్తిమీద ఉండే టోపీని విసిరేసాడు. ఇతని ప్రవర్తనను చూచిన కోతులు కూడా టోపీని విసిరేసాయి. ఊహించని విధంగా ఆ కోతులన్నీ టోపీలను విసిరివేసినందుకు ఆనందించి వాటిని బుట్టలో వేసుకొని అమ్ముకోవడానికి బయలుదేరినాడు.
నీతి : సమయ సందర్భాలననుసరించి ఉపాయంతో ఎటువంటి కఠిన సమస్యలనైనా సాధించవచ్చు, పరిష్కరించవచ్చు.
also read news:
జామ పండు తింటే కలిగే లాభాలు తెలుసా? శీతాకాలంలో మిస్ అవ్వకండి!