moral stories in telugu : ఒక అడవిలో ధైర్యసాహసాలకు మారు పేరైన సింహం రాజ్యం చేస్తుండేది. ఆ అడవిని ఆనుకుని ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని వడ్రంగి రోజూ అడవికి వెళ్ళి కలప తెచ్చుకొని నాణ్యమైన చెక్క సామానులు తయారు చేసి పట్నంలో అమ్మేవాడు. రోజూ అరణ్య మార్గంలో వెళ్ళటం వలన మృగరాజుకి వడ్రంగికి మంచి స్నేహం కలిసింది. పట్నం నుంచి తిరిగి వస్తూ ఎంతో రుచికరమైన అల్పాహారాన్ని తెచ్చి ప్రేమతో సింహానికి పెట్టేవాడు. కొసరి కొసరి తినిపించేవాడు.
రోజులు హాయిగా గడుస్తున్నాయి. ఒక గడుసు కాకి, జిత్తులమారి నక్క మృగరాజు స్నేహం కోరాయి. సహాయం చేస్తామని వాగ్దానం చేశాయి. నిజమే అనుకుని సింహం వాటి స్నేహనికి అంగీకరించింది. వడ్రంగి పట్నం నుంచి వస్తూ తన నేస్తం పక్కన నక్కని, కాకిని చూసి చటుక్కున దూరంగా వెళ్ళిపోయాడు. సింహం, నక్క, కాకి చాలా ఆశ్చర్యపోయాయి.
‘మిత్రమా ! నక్కా, కాకి, నా కొత్త నేస్తాలు. భయంలేదు తిరిగిరా! అంది సింహం. మృగరాజా! నక్కా, కాకి, రెండు అల్ప బుద్ధిగల జీవులే. నక్క ఏనాడు ఎవరికీ సాయం చేయకపోగా తన జిత్తులతో అందర్నీ మోసం చేస్తుంది.
ఇద్దరి మధ్య తగవులు పెట్టి తమాషా చూస్తుంటుంది. ఒకరిని ఒకరు చంపుకుంటుంటే ఆనందిస్తుంది. అందరూ చచ్చాక వచ్చి ఆ మాంసం తింటుంది. ఎంచి చూస్తే ఒక్క మంచి లక్షణం లేదు.
ఈ కాకి ఏం తక్కువైనది కాదు. ‘ఎద్దు పుండు కాకికి రుచి’ అనే సామెత ఉంది. వారి చెడు బోధలను నువ్వు తప్పక వింటావు. నన్ను చంపి తింటావు. మిగిలిన మాంసాన్ని నక్క కాకి తింటారు. నేటి నుంచీ నీ స్నేహం నాకు వద్దు, మీతో అన్నీ ప్రమాదాలే. చూస్తూ చూస్తూ రోట్లో తల పెట్టలేను, ‘కొరకంచుని కౌగలించుకోలేను’ అని వెళ్ళిపోయాడు వడ్రంగి. అల్పులతో స్నేహం చేసి సింహం మంచి మిత్రుని పోగొట్టుకుంది. మంచి తిను బండారాలను పోగొట్టుకుంది. బాధపడ్డా సుఖమేముంది? జరగాల్సింది జరగనే జరిగింది.
నీతి : అల్పులతో స్నేహం చేసేవారికి దూరంగా ఉండటమే .
also read :
Sonam kapoor Profile, Photos, Images, Stills 2023
Taraka Ratna : తారకరత్న పెద్ద కర్మ కార్డ్లో మిస్ అయిన తల్లిదండ్రుల పేర్లు ?