Telugu Flash News

Moral Stories in Telugu : నిజం విలువ తెలుసుకోండి..

moral story in telugu

Moral Stories in Telugu : చాలాకాలం క్రితం ఒక బందిపోటు దొంగ ఉండేవాడు. ఒకరోజు అతను దొంగతనానికి బయలుదేరాడు. అర్థరాత్రి కావటానికి ఇంకా చాలా సమయం ఉంది. కాలక్షేపం కోసం ఒక సభలోకి వెళ్ళికూర్చున్నాడు.

ఒక సాధుపుంగవుడు బోధనలు చేస్తున్నాడు. అతని ప్రవచనాలు, సూక్తులు చాలా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రవచనాల అనంతరం సాధువు దగ్గరకు వెళ్ళి బంది పోటు ఇలా అన్నాడు.

“స్వామీ ! నేనొక బందిపోటును నేను ఎందరినో దోచుకున్నాను. కొంతమందిని చంపేశాను కూడా. నాకేమైనా ప్రాయశ్చిత్తం ఉందా ?

దానికి సమాధానంగా సాధువు ఇక నుంచీ నువ్వు సత్యమే పలుకు” అని చెప్పాడు.

సాధువు మాటలను ఆచరించాలని బందిపోటు నిర్ణయించు కున్నాడు. ఆ మరునాడు అతను రాజుగారి ఖజానాలోంచి కొంత ధనాన్ని తస్కరించాలని పధకం వేశాడు. అతడు కోట ముఖ ద్వారం వద్దకు ప్రవేశించగానే అక్కడున్న సైనికుడు “ఎవరు నువ్వు ?” అని ప్రశ్నించాడు.

వెంటనే “నేనొక బందిపోటును” అని బందిపోటు నిజం చెప్పాడు. అతని మాటలు విన్న సైనికుడు అతని మాటలు నమ్మలేదు పైగా మారువేషంలో ఉన్న ఎవరైనా ముఖ్య అధికారి కావచ్చునని భావించి బందిపోటును లోపలికి అనుమతించాడు. అతడు లోపలికి వెళ్ళి భాండాగారానికి పంపడానికి సిద్ధం చేసిన రత్నాలున్న సంచిని తీసుకొని బయటకు వచ్చాడు. మళ్లీ అదే సైనికుడు బందిపోటును అడిగాడు “ఏఁ తీసుకున్నావు ?”

“రత్నాలు ఇవే నాకు దొరికాయి”.

“ఎవరి అనుమతితో తీసుకొని వెళ్తున్నావు ?”

“అనుమతా ? నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను వీటిని దొంగిలించుకొని వెళ్తున్నాను” అని చెప్పాడు బంది పోటు.

సైనికుడు తెల్లబోయాడు. అతనికంతా అయోమయంగా అనిపించింది. బందిపోటును ముఖ్యఅధికారిగానే తలచి వదిలేశాడు.

మరునాడు ఉదయం దొంగతనం బయటపడింది. విచారణలో అపరిచిత వ్యక్తి తను బందిపోటునని చెప్పి మరీ దోచుకున్నాడనే సంగతి బయటపడింది. రాజు ఆశ్చర్యపోయాడు. అతని కోసం గాలింపు మొదలయ్యింది.

బందిపోటు కూడా నగరంలోనే ఉండటం వలన సైనికులు అతన్ని పట్టుకున్నారు. రాజుగారి ముందు కూడా బందిపోటు నిజమే చెప్పాడు.

రాజుగారు అతని పట్ల ఆకర్షితుడై రాజాస్థానంలోనే విలువైన వస్తువులను రక్షించే అధికారిగా అతడిని నియమించాడు.

నిజం మాట్లాడితే జరిగే మంచేమిటో బందిపోటుకు అర్థమయ్యింది. అతను శాశ్వతంగా దొంగతనం మానేసి సత్య మార్గంలో జీవించాలనుకున్నాడు. ఆ రోజు నుంచీ బందిపోటు మంచివాడిగా మారి రాజు కొలువులో సముచిత స్థానం సంపాదించాడు.

నీతి : ఒక మంచి లక్షణం అలవరచుకుంటే ఎన్నో మంచి లక్షణాలు వాటంతటవే అలవడతాయి. 

మరిన్ని నీతి కథలు చదవండి Moral stories 

 

Exit mobile version