Homemoral stories in telugumoral stories in telugu : ఎప్పుడూ నిజమే చెప్పాలి

moral stories in telugu : ఎప్పుడూ నిజమే చెప్పాలి

Telugu Flash News

moral stories in telugu : అనగా అనగా ఒక ఊర్లో ఒక బీద కాపువాడు ఉండే వాడు. వాడు ఎపుడు నిజమే చెప్పేవాడు, మాట వరుసకు కూడా అబద్ధము చెప్పేవాడు కాడు. కాని కాపువాడి తమ్ముడు చాలా అబద్ధాలు చెప్పేవాడు. అమ్మా, నాన్న ఎన్ని సార్లు చెప్పినా వినేవాడు కాదు.

ఈ అన్నదమ్ములిద్దరు ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అవి అమ్మి జీవించేవారు. సాయంత్రానికి ఇద్దరు కట్టెలు అమ్మిన డబ్బును భార్యకిస్తే ఆమె సరుకులు కొని వంట చేసి పెట్టేది. ఇలా వీరు జీవనం సాగిస్తూ ఉండేవారు.

ఒక రోజు కాపువాడు గొడ్డలి తీసుకొని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లాడు. చెట్టుపైకి ఎక్కి కొమ్మలు కొడుతూ ఉన్నపుడు పొరపాటున అతని గొడ్డలి చేతిలోంచి జారిపోయి క్రింద ఉన్న చెరువులో పడిపోయినది. అపుడు కాపువాడు చాలా దుఃఖించాడు.

అయ్యో ఈ గొడ్డలి వల్లే కదా నేను జీవనం సాగించేది. ఈ గొడ్డలి నా అజాగ్రత్త వల్ల చెరువులో పడిపోయింది. ఇంకొక గొడ్డలి కొనే శక్తి నాకు లేదు ఇంక ఎలా జీవించేది అని బాధపడ్డాడు.

దేవత ప్రత్యక్షం

అపుడు చెరువులోంచి ఒక దేవత బయటకు వచ్చి కాపువాడా! ప్రశాంతంగా ఉన్న నాలో నువ్వు గొడ్డలి పడవేసి నన్ను ఇబ్బంది పెట్టావు. అయినా నువ్వు రోజూ ఇక్కడికి వస్తుంటావు, నీవు చాలా బీదవాడవు కాబట్టి నీకు నీ గొడ్డలి ఇచ్చివేస్తాను. నీ జీవితం సంతోషంగా సాగిపోతుంది అని అంటుంది.

అపుడు కాపువాడు ఆ దేవతకు నమస్కరించి నీ ప్రశాంతతకు భంగం కలిగించినందులకు క్షమించాలి. ఇది నేను తెలియక చేసిన తప్పు. పొరపాటున నీటిలో పడిపోయినది. నీ దయాగుణానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నా గొడ్డలి నాకు తిరిగి ఇవ్వమని ప్రార్థించాడు.

-Advertisement-

అపుడు ఆ దేవత బుడుంగుమని నీళ్ళలో మునిగి ఒక బంగారు గొడ్డలి చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ఈ కాపువాడు తల్లీ ఇది నా గొడ్డలి కాదు. బంగారపు గొడ్డలి అంత ధనవంతుడిని నేను కాదు. అని నా గొడ్డలి నాకు ఇవ్వమని మరలా ప్రార్థించాడు.

ఆ దేవత చిరునవ్వు నవ్వి మళ్ళీ నీళ్ళలో బుడుంగుమని మునిగిపోయింది. రెండు క్షణాలలో మళ్ళీ నీళ్లలో తేలి, ఈసారి వెండి గొడ్డలి చూపించి ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది మళ్లీ ఆ కాపువాడు ఆ గొడ్డలిని చూచి అమ్మా ఇది వెండి గొడ్డలి. మొదట చూపించినది బంగారు గొడ్డలి ఈ రెండూ నావి కావు. నా గొడ్డలి ఇనుముతో చేసినది అది తెచ్చి యివ్వమని ప్రార్థించాడు.

ఆ దేవత కాపువాడు నిజమే చెప్పినందుకు సంతోషపడి నీవు చాలా సత్యమే చెప్పావు. కాబట్టి నీ సత్యశీలకు సంతోషపడుతూ ఈ మూడు గొడ్డళ్లు నీకు బహుమతిగా ఇస్తున్నాను అని బంగారు, వెండి, ఇనుప గొడ్డలిని కూడా ఇచ్చింది. ఆ కాపువాడు ఇంటికి వెళ్లి బంగారు, వెండి గొడ్డళ్లను అమ్మి భార్య పిల్లలతో సుఖంగా జీవించాడు.

సోదరుడి దురాశ

కాపువాని సోదరుడు ఆశ్చర్యపడి తన అన్నకు ఇంత సంపద ఎలా వచ్చింది అని అడిగాడు. జరిగినదంతా కాపువాడు తమ్మునికి చెప్పాడు తాను కూడా బంగారు, వెండి గొడ్డలిని తెచ్చుకోవాలని అడవికి వెళ్లి చెరువు గట్టుమీద ఉన్న చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతున్నట్లు, నటించి గొడ్డలిని నీళ్ళలో బలంగా విసిరేశాడు.

పెద్దగా ఏడుస్తూ అయ్యో నా గొడ్డలి నీళ్లలో పడిపోయింది ఏ దేవతైనా కరుణించి నా గొడ్డలి నాకు తెచ్చి యిస్తే ఆ దేవతకి కొబ్బరికాయ కొడతానని అన్నాడు.

అపుడు నీళ్లలోంచి దేవత బయటికి తేలి ఎందుకు దుఃఖిస్తున్నావు. నీవు అనవసరంగా బాధపడకు. నీ గొడ్డలి నీకు క్షణములో తెచ్చి యిస్తాను. నీవు మళ్లీ కొమ్మలు కొట్టుకొని హాయిగా జీవించవచ్చు సరేనా అంది. అపుడు కాపువాడు సరే అన్నాడు.

ఆ దేవత కాపువాడి గొడ్డలి తెచ్చి యిచ్చింది. తన అసలైన గొడ్డలిని చూచి ఆ కాపువాడు ఇది నాగొడ్డలి కాదు అన్నాడు. దేవత మళ్ళీ గొడ్డలితో సహా నీళ్లలో మునిగి ఈ సారి వెండి గొడ్డలి చూపించింది. మళ్ళీ కాపువాడు ఈ గొడ్డలి నాది కాదు అని అన్నాడు. మళ్ళీ దేవత నీళ్లలో మునిగి బంగారు గొడ్డలి తెచ్చింది. ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది.

కాపువాడు సంతోషంగా అవును అవును అదే అదే అని పెద్దగా అరిచాడు. అప్పుడు దేవత ఓరీ! దుష్టుడా ! నీవు అబద్దము చెపుతున్నావు. నీకు అత్యాశ ఎక్కువ. అబద్దము చెప్పినందుకు నీకు వెండి, బంగారు గొడ్డళ్లే కాదుకదా ఇనుపగొడ్డలి కూడా ఇవ్వను అని ఆ దేవత నీళ్లల్లో మునిగి అదృశ్యమైంది.

పాపం కాపువాడు అయ్యో నేను అత్యాశకు పోయి అబద్ధము చెప్పడం వల్ల ఉన్న గొడ్డలి కూడా పోగొట్టుకున్నాను. అని విచారించాడు. వాడు మళ్ళీ మళ్ళీ ఎంత పిలిచినా ఆ దేవత రాలేదు. చీకటి పడుతున్నందువల్ల గొడ్డలి లేకనే చింతిస్తూ ఇంటికి వెళ్లిపోయాడు.

నీతి : “నిజం చెప్పడం వల్ల అన్నకు బంగారు మరియు వెండి అదనంగా తన గొడ్డలితోపాటు లభించాయి. రెండవ కాపు అబద్ధాలు చెప్పడం వల్ల ఉన్న గొడ్డలి కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడూ నిజమే చెప్పాలి.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News