moral stories in telugu : ఒక గురువుగారు తన ప్రియ శిష్యులతో ఈ లోకంలో నిజమైన బంధువు, మిత్రుడు ఒక్క భగవంతుడే తక్కిన వారంతా నామమాత్రపు మనుష్యులని బోధించడం మొదలుపెట్టారు. కాని ఆయన శిష్యులలో ఒక శిష్యునికి ఈ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు.
అతడు గురువు గారితో మీ మాటను నేను అంగీకరించలేను గురువుగారు” అని అన్నాడా శిష్యుడు. అంటే | “నా తల్లి, తండ్రీ, భార్య, ఇతర బంధువులు అందరూ నన్ను శ్రద్ధ భక్తులతో ప్రేమిస్తున్నారు. అభిమానిస్తున్నారు. నేను లేందే వారు క్షణమైనా నిలువలేరు వారి ప్రేమను నేనెలా అనుమానిస్తాను” అని అన్నాడా శిష్యుడు.
అపుడు గురువుగారు, “నాయనా శిష్యా ! నీవనుకొన్నట్లు వారి ప్రేమ తాత్కాలికమైనది. అది నిజమని, శాశ్వతమని భావించడం అవివేకమే అవుతుంది. ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను నేను ఎలా చెపితే అలా చేయి” అని బోధ చేసి “ఈ మాత్రలు మ్రింగి ఇంటికి పోయి పడుకో కొంత సేపటికి నీవు మరణించినట్లు పైకి కనిపించినా సమస్త విషయాలను గమనిస్తూ, మాటలను వింటూ ఉంటావు. చూడు” అని చెప్పి శిష్యునికి మాత్రలు ఇచ్చి వేసుకొన్న తరువాత ఇంటికి పంపివేశాడు.
ఆ శిష్యుడు గురువు చెప్పిన ప్రకారంగా ఇంటికి వెళ్లి మంచంపై పడుకున్నాడు. కొంత సమయం తర్వాత అతని తల్లి, తండ్రి, భార్య స్పృహలేకుండా పడి ఉన్న అతన్ని చూచి దుఃఖిస్తూ వైద్యునిగా గురువుగారిని పిలువగా గురువుగారు వచ్చి శిష్యుడి నాడిని పరీక్షిస్తున్నట్లుగా నటించి “ఇతనిని బ్రతికించడానికి మందు నా వద్ద ఉన్నది అని అనగానే వారందరి ఆనందానికి అంతులేక పోయింది.
ప్రేమల్ని, బంధాల్ని నిరూపించుకోండి
కానీ మీరందరూ ఒక్క విషయాన్ని గమనించాలి. అది ఏమంటే ఈ మందులో సగం ముందుగా అతని బంధువు ఎవరైనా మ్రింగాలి మిగిలిన సగభాగం రోగి మ్రింగితే అతను బ్రతుకుతాడు. కానీ మొదట మ్రింగినవారు మాత్రం మరణిస్తారు మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందుతిని ఇతనిని బ్రతికించండి. తల్లీ, తండ్రీ, భార్య లేదా ఇతరులెవరైనా సరే రోగిని బ్రతికించి అతనిపై మీకు గల అభిమానాన్ని ప్రేమల్ని, బంధాల్ని నిరూపించుకోండి” అని వైద్యుడుగా ఉన్న గురువుగారన్నారు.
గురువుగారన్న మాటలను శిష్యుడు మంచంపై పడుకొని వింటున్నాడు. వైద్యుడు మొదట అతని తల్లిని పిలిచి – “అమ్మ! ఈ మందు తీసుకొని నీ కుమారుని ప్రాణం కాపాడుకో, కుమారునికై నీ ప్రాణాలు త్యాగంచేసి మాతృప్రేమను చాటుకో!” అన్నాడా వైద్యుడు.
ఆ తల్లి ఆ మందును తీసుకొని కొంతసేపు ఆలోచించి “అయ్యా ! నాకింకా పిల్లలున్నారు నేను లేకపోతే వారేమైపోతారు. వారిని పెంచి పెద్దగా ఎవరు చేస్తారు!” అని బదులు చెప్పింది.
తర్వాత తండ్రిని అడగ్గా, ఆమె సమాధానాన్నే బదులుగా చెప్పాడు. తర్వాత భార్యను పిలిచి మందును ఆమె చేతికివ్వగా ఆమె ఏడుస్తూ కొంతసేపు ఆలోచించి, “నా భర్త కొరకు నేను మరణిస్తాను అందుకు సిద్ధంగానే ఉన్నాను కాని నేను లేందే ఈ పసిపిల్లలను ఎవరు ఆదరిస్తారు. కనీసం ఈ చిన్న పిల్లలకొరకైనా నేను బ్రతికి ఉండాలి అని బదులు చెప్పిందా ఇల్లాలు.
ఈ మాటలనన్నింటిని విన్న ఆ శిష్యునికి గురువు బోధనలోని నిజమెంతో తెలిసిపోయింది. ఆలస్యం చేయకుండా వెంటనే మంచంపై నుండి లేచి గురువుగారికి నమస్కరించి, “మహాత్మా ! మీరు చెప్పింది అక్షర సత్యం నిజమైనదే వాస్తవమైనదే.
వీరందరూ నిజంగా నన్ను ప్రేమిస్తున్నారని, అభిమానిస్తున్నారని, నేను లేనిదే ఆ బ్రతుకలేరనే భ్రమలో మునిగి ఉన్నాను నేనిప్పుడు ప్రత్యక్షంగా వాస్తవమైన జీవితంలోకి వచ్చి వాస్తవాల్ని తెలుసుకోగలుగుతున్నాను.
మనకు నిజమైన బంధువు, స్నేహితుడు ఆ పరమేశ్వరుడు భగవంతుడు, ఆ సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడు ఒక్కరే” అని ఆవేశంతో, భక్తి పూర్వకంగా అంటూ గురువుగారికి పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదాలను పొందాడు.
నీతి : నిజమైన రక్షకుడు భగవంతుడే. బంధువుల ప్రేమలు శాశ్వతం కావు.
Also read:
క్యారెట్, బీట్‌రూట్, టమాటా కాంబో జ్యూస్.. పరగడుపున తాగితే లాభాలివే!
Rishabh Pant: రిషబ్ అభిమానులకి షాకింగ్ న్యూస్.. వచ్చే ఏడాది కూడా పంత్ ఆడడం డౌటే…!