Moral Stories in Telugu : రాము చాలా నెమ్మదస్తుడు. బుద్ధిగా చదువుకుంటూ ఉండేవాడు. అదే ఊళ్ళో మరికొంత మంది ఆకతాయి కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడూ ఏదో ఒకతుంటరి పనిచేయటం, పెద్దవాళ్ళతో తిట్లు తినడం చేస్తూ ఉండేవాళ్ళు. ఇది రోజూ అలవాటుగా మారింది కూడా! రామూ అంటే వాళ్ళకి పడేది కాదు. కానీ రామూ మాత్రం వాళ్ళతో స్నేహంగా ఉంటూ వాళ్ళందరినీ స్నేహితులుగానే భావించేవాడు.
అల్లరి పనులు చేస్తూ చదువును అశ్రద్ధ చేయడం మంచిది కాదని చెబుతూ ఉండేవాడు. కానీ వాళ్ళు పట్టించుకొనేవారు కాదు. అయినా రామూ వాళ్ళతోనే కలిసి స్కూలుకు వెళ్ళేవాడు. వాళ్ళతోనే ఆడుకొనేవాడు.
ఓ రోజు ఆ ఊరి జనమంతా వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరికి దూరంగా ఉన్నతోటలో పెద్దలంతా వంటలు చేసే పనిలో ఉన్నారు. పిల్లలంతా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. రాము కూడా వాళ్ళతోనే ఆడుకుంటున్నాడు.
ఒరేయ్ ప్రక్కనే మామిడితోట ఉంది. చాటుగా వెళ్ళి మామిడికాయలు కోసుకుందామా ?” అన్నాడు వాళ్ళతో ఒకడు.
మిగిలిన వాళ్ళంతా వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉండటంతో “వద్దు! అలా దొంగతనంగా మామిడిపండ్లు కోయడం తప్పు” అన్నాడు రాము.
అయితే నువ్వు ప్రక్కన నిలబడు, మేమంతా కోసుకుంటాం” అంటూ రామూను కూడా వెంట తీసుకువెళ్ళారు.
దొంగతనంగా మామడికాయలు కోయడం మొదలు పెట్టారు. మిగిలిన పిల్లలు. అంతలో ఆ తోట యజమాని వాళ్ళందరినీ చూశాడు. అక్కడున్న పని కుర్రాణ్ణి పిలిచి అందరినీ పట్టుకోమన్నాడు. ఓ కర్ర తీసుకొని వరుసగా అందరినీ బాదటం మొదలు పెట్టాడు.
రామూ దగ్గరకు వచ్చేసరికి “ఆగండి…. ఆగండి…. నన్ను క్షమించండి. నేను దొంగతనానికి రాలేదు. వద్దని చెప్పినా వినకుండా వీళ్ళే నన్ను ఇక్కడకు తీసుకువచ్చారు. నేను చాలా మంచి వాణ్ణి. దయచేసి నన్ను కొట్టకండి” అని బ్రతిమాలు కున్నాడు.
నువ్వు మంచివాడివే కావచ్చు కానీ చెడ్డ స్నేహితులతో తిరిగితే నిన్నూ చెడ్డవాడిగానే జమకడతారు. శిక్ష తప్పదు అంటూ చేతిలోని కర్రతో రాముని కొట్టాడు యజమాని.
మనం మంచిగా ఉండటమేకాదు చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి అని తెలుసుకొన్న రాము ఆరోజు నుండీ వాళ్ళతో కలిసి తిరగటం, స్నేహం చేయటం మానేసాడు.
నీతి : చెడ్డవారితో స్నేహం చేయటం ప్రమాదాలను కొని తెస్తుంది..