moral stories in telugu : గంగానదీ తీరంలో పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో ‘జరద్గవము’ అనే ముసలి గద్ద ఉండేది. దానికి వయస్సు మీద పడటం వల్ల కళ్ళు సరిగా కనిపించేవి కావు. సరిగా ఎగర లేకపోవటం వలన ఆహార సంపాదనకు కూడా వెళ్ళలేకపోయేది. అందువల్ల ఇతర పక్షులన్నీ జాలి పడి దానికి కావలసినంత ఆహరం తెచ్చిపెట్టేవి. దాని జీవితం సుఖంగానే వెళ్ళి పోతున్నది. ఇంతలో ‘దీర్ఘకర్ణుడు’ అనే పెద్ద పిల్లి ‘జరద్దవము’ దగ్గరికి వచ్చి
“గౌరవనీయులైన గద్దగారూ! ఇక నుంచి మీరే నా గురువులు. మీ సేవ చేసుకుంటూ మీరు చెప్పే మధుర సుభాషితములు వింటూ నా శేష జీవితం గడిపేస్తాను. అనుభవజ్ఞులు అందించే అనుభవసారం అమృత ప్రాయం. నేను ఎన్నో ఎలుకలను చంపి ఆ పాప ప్రక్షాళనకు కాశీ వెళ్ళి వచ్చాను” అంది.
ఆ తియ్యటి మాటలకు గద్ద తబ్బిబ్బయి పిల్లిని తన శిష్యుడిగా స్వీకరించింది. పిల్లి తన చాకచక్యంతో గద్దని బాగా నమ్మించి గట్టి నమ్మకం కుదిరాక చెట్టెక్కి గూళ్ళలో ఉండే గుడ్లను, పక్షికూనలను తినేసి, గుడ్ల పెంకులను, పక్షి పిల్లల ఈకలను తెచ్చి గద్ద ఉండే తొర్రలో పెట్టేది. పాపం! మోసం తెలియని జరద్దవము పిల్లికి నీతి వాక్యాలు, ప్రవచనాలు చెప్పేది. పక్షులు వాటి గుడ్లు, పసికూనలు కనిపించక దుఃఖపడేవి. పక్షులకి గద్ద మీద అనుమానం వచ్చి తొర్రలోకి తొంగిచూస్తే గుడ్ల పెంకులు, ఈకలు కనిపించాయి.
గద్ద మీద పట్టరాని కోపం వచ్చి, “ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు” అన్నట్టుంది. నాగు పామును చూసి వానపాము అనుకున్నాము. మేము నీకింత సాయం చేస్తుంటే మా గుడ్లనీ, పిల్లలని చంపి తింటావా? అని నిలదీశాయి, తిట్టాయి, అసహ్యించుకొని ‘ఉపకారికి, అపకారం చేసిన నీకిదే తగిన శిక్ష అనుభవించు’ అని పీకి రక్కి చంపేశాయి.
అయినా గుడ్లు, పిల్లలు మాయం అవుతుండటంతో పొంచి చూసి దొంగపిల్లి అని నిర్ధారించుకున్నాయి. ఒక్కుమ్మడిగా పిల్లి మీద పడి పొడిచిపొడిచి చంపేశాయి. కాని చేయని తప్పుకు ముసలి గద్దని చంపినందుకు బాధపడ్డాయి. “చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం” తెలియక చేసినా తప్పు తప్పే.
నీతి: ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.
also read :
Naresh- Pavitra: ఎట్టకేలకు పవిత్ర మెడలో మూడు ముళ్లు వేసిన నరేష్..వైరల్‌గా మారిన వీడియో