Moral Stories in Telugu : ఒక కొండపైన ఆలయం ఉంది. ఆలయానికి వెళ్ళే మార్గం చాలా కఠినంగా ఉన్నా భక్తులు విశ్వాసంతో అధిక సంఖ్యలో దైవ దర్శనానికి వచ్చేవారు.
ఒకరోజు ఆలయ ప్రధాన పూజారి చనిపోయాడు. ఆలయ నిర్వాహకులు కొత్త పూజారిని నియమించాలనుకున్నారు. ఆసక్తిగల అభ్యర్థులను మంగళవారం నాడు పరీక్షించాలనుకున్నారు. ఆ రోజు చాలా మంది హాజరయ్యారు. ఎంపిక ముగుస్తుండగా, ఒక యువకుడు నుదుట తిలకంతో నిర్వాహకుల ముందు నిలబడ్డాడు.
“క్షమించండి. నేను రావడానికి కొంచెం ఆలస్యమైంది. నేను కూడా పూజారి అభ్యర్ధిని” అని పరిచయం చేసుకున్నాడు.
“కొంచెం కాదు. నీవు చాలా ఆలస్యంగా వచ్చావు. ఎంపిక జరిగిపోయింది” అని పూజారిని ఎంపిక చేసే సభ్యులలో ఒక సభ్యుడు అన్నాడు.
చేసేదేముంది ? దానికి యువకుడు “అయ్యో ! అలాగా …. కనీసం దేవుడిని చూసి మొక్కుకొని వెళ్తాను” అన్నాడు.
“ఎందువల్ల ఆలస్యమైంది ?” అని ఒక సభ్యుడు ప్రశ్నించాడు.
. “అయ్యా ! నేను ముందుగానే బయలుదేరాను. ఈ ఆలయానికి వచ్చే మార్గం రాళ్ళు రప్పలతో ఉండటంవల్ల ఆలయానికి రావడానికి భక్తులు చాలా కష్టపడుతున్నారనిపించింది. అందువల్ల నేను నాకు వీలైనంతగా రాళ్ళు తీసివేసి వస్తున్నాను. దాని కోసం చాలా సమయం వృధా అయింది” అని చెప్పాడు ఆ యువకుడు.
ఎంపిక చేసే సభ్యులు కాసేపు ఒకరితో ఒకరు చర్చించు కున్నారు. తరువాత ఆ యువకుడినే ఆలయపూజారిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. అతడికి వేదమంత్రాలు బోధించే ఏర్పాటు చేశారు.
నీతి : ఏ ప్రార్థనయైన నిజమైన భక్తితో చేయబడితే అది వేద మంత్రాలతో సమానం.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు