Telugu Flash News

moral stories in telugu : అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది

moral stories in telugu

moral stories in telugu : 

ఒకప్పుడు ఒక గ్రామంలో గోవిందు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్ళేవాడు. అవి గడ్డి మేస్తుండగా చుట్టూ పక్కలకు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవి. అవి తప్పిపోకుండా ఉండటానికి వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టేవాడు. అవి మేతకు వెళ్ళగానే అతను కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి తీసుకువచ్చేవాడు. గంటలు కట్టడం వల్ల ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఇష్టమైన ఆవుకి ఒక ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది.

ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు వెళ్తున్న ఒక వ్యక్తి ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా దొంగిలించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి, “ఆవు మెడలో ఉన్న గంట చాలా బాగుంది. దాన్ని నాకు అమ్ముతావా? నీకు ఏంత కావాలంటే అంతిస్తాను” అని అడిగాడు.

“ఈ వ్యక్తి ఎంత బుద్ధిహీనంగా ఉన్నాడు? ఒక సాధారణ గంటకు ఇంత డబ్బు ఇస్తున్నాడు” అని మనసులో అనుకున్నాడు గోవిందుడు. కానీ అత్యాశతో , “సరే, అమ్ముతాను ” అన్నాడు.

ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని, గోవిందుడికి డబ్బు ఇచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు ఆ గంటను కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప మిగితా ఆవులు అన్నీ కనిపించాయి.

గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడ ఉందో గోవిందుడికి తెలియలేదు. ఆవు పోయినందుకు చాలా బాధపడ్డాడు. ఆ గంటను కొన్న వ్యక్తి తన ఆవును దొంగిలించాడని గ్రహించలేక పోయాడు. “అయ్యో, గంట ఉంటే బాగుండేది” అని చింతించాడు.

నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.

 

Exit mobile version