Mitchell Marsh : కొద్దిరోజుల క్రితం భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. ట్రోఫీ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. ఈ ఫోటోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయిలో పోటీపడే జట్లన్నీ కలసి పోరాడి గెలుచుకునే ట్రోఫీని అలా అవమానించడం తప్పు అని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు, క్రికెటర్లు అందరూ మార్ష్‌ను తప్పుబట్టారు. ఈ విషయంపై స్పందించని మార్ష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఆ ఫోటోలో ఎలాంటి అవమానం లేదు. నేను దాని గురించి అధికంగా ఆలోచించలేదు. సోషల్ మీడియాను అధికంగా చూడను. అయినా అందులో నాకు ఏ తప్పూ కనిపించలేదు. మళ్లీ అలా చేయడానికి నాకు అభ్యంతరం లేదు” అని అన్నాడు.
మార్ష్ చేసిన ఈ పనికి భారత క్రికెటర్ మహ్మద్ షమీ కూడా అసహనం వ్యక్తం చేశాడు. “మార్ష్ అలా చేయడం నాకు చాలా బాధ కలిగించింది” అని షమీ అన్నాడు. భారతదేశానికి చెందిన ఓ అభిమాని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖ రాసి, మార్ష్‌ను క్రికెట్ నుంచి నిషేధించాలని కోరాడు.
మిచెల్ మార్ష్ చేసిన పనిపై మీ అభిప్రాయం ఏమిటి?