Michaung Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మిచాంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచాంగ్ తుఫాను గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
నైరుతి బంగాళాఖాతంలో మిచాంగ్ తుఫాను
ప్రస్తుతానికి చెన్నైకి 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలోమీటర్లు, బాపట్లకు 360 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తుఫానుగా తీరం దాటనుంది.
దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
నెల్లూరు జిల్లాలో అప్రమత్తత
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ, మంగళవారం సాయంత్రం వరకు తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం తగ్గేవరకు జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ప్రజలకు సూచనలు
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, గాలులు వీయనున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తీరప్రాంత ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
మురుగునీటి పారుదల వ్యవస్థలను శుభ్రం చేయాలి.
విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోకుండా చర్యలు తీసుకోవాలి.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు.
తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.