Telugu Flash News

Medico Preethi : మెడికో ప్రీతి బ్రెయిన్‌ డెడ్‌.. హెల్త్‌ బులెటిన్‌ విడుదల..

medico preethi

పీజీ విద్యార్థిని, మెడికో ప్రీతి (Medico Preethi) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం ప్రీతి హెల్త్‌ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యంపై కీలక వివరాలు బహిర్గతం చేశారు. ర్యాగింగ్‌ భూతం కారణంగా తీవ్ర భయకంపితురాలైన ప్రీతి.. ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఐదు రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌లో ఆమెకు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి ఆస్పత్రి వద్దకు చేరుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వైద్యులు చెబుతున్నారని ప్రీతి తండ్రి నరేందర్‌ తీవ్ర ఆవేదనతో చెప్పారు. చికిత్స అందుతోందన్న భరోసాతో ఇప్పటి వరకు కాస్త ధైర్యం ఉండేదని, అయితే, ఇప్పుడు ఆమె బతికే అవకాశాలు లేవంటూ వైద్యులు తేల్చారని దుఃఖిస్తూ ఆయన తెలిపారు.

ఇక ఆశలు వదిలేసుకున్నామంటూ కన్నీటిపర్యంతమయ్యారు ప్రీతి తండ్రి. ప్రీతి శరీరం కూడా రంగు మారిపోయిందని వైద్యులు తెలిపారన్నారు. మొదటి రోజుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని వైద్యులు తెలిపారన్నారు.

తన కుమార్తె ప్రీతిని సైఫే హత్య చేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారాన్ని హెచ్‌ఓడీ సరిగా హ్యాండిల్‌ చేయలేదని, కావాలనే నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారని, ఘటన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగితే ఉదయం 8 గంటలైనా తమకు సమాచారం అందించలేదన్నారు.

ప్రీతి సెల్‌ఫోన్‌లో వారికి కావాల్సినట్లుగా ఆధారాలను మార్చేసుకున్నారని ఆరోపించారు. ఇది సైఫ్‌ చేసిన హత్యేనని, ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ప్రీతి తండ్రి డిమాండ్‌ చేశారు.

మరోవైపు ప్రీతి హెల్త్‌ కండిషన్‌పై రాత్రి 8 గంటలకు మరోసారి నిమ్స్‌ వైద్యులు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిమ్స్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బందోబస్తును పటిష్టం చేశారు.

అంతకు ముందు ఈరోజు మధ్యాహ్నం.. ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. సైఫ్‌ ఎలా వేధిస్తున్నాడో ప్రీతి తన తల్లితో చెబుతున్న ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సైఫ్‌ తనతోపాటు జూనియర్లను వేధిస్తున్నాడని, ఈ విషయంలో సీనియర్లంతా ఒక్కటయ్యారని తల్లితో తన గోడును వెళ్లబోసుకుంది. ఈ వ్యవహారంపై హెచ్‌వోడీ చర్యలు తీసుకోలేదని ప్రీతి సెల్‌ఫోన్లో చెప్పింది.

also read :

Medico Preethi Passed away | మెడికో ప్రీతి కన్నుమూత..

Telangana TDP: తెలంగాణ ప్రజలు టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు.. ‘ఇంటింటికీ టీడీపీ’లో చంద్రబాబు

Gautam Adani : నెలరోజుల్లోనే 12 లక్షల కోట్ల సంపద ఆవిరి.. 3 నుంచి 30వ స్థానానికి అదానీ!

 

Exit mobile version