Manchu Vishnu: మా ఎన్నికల సమయం నుండి మెగా వర్సెస్ మంచు అన్న మాదిరిగా కోల్డ్ వార్ నడుస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు వీలు దొరికినప్పుడల్లా మంచు ఫ్యామిలీకి చురకలు అంటిస్తూనే ఉన్నాడు.
అయితే గత ఏడాది అక్టోబర్ 13న విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా, నిన్నటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా మంచు విష్ణు, మోహన్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పాత ఆరోపణలను మంచు విష్ణు మళ్లీ తెర మీదకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
మంచు విష్ణు స్కెచ్..
మీడియా సమావేశంలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇకమీద రెండు సినిమాల్లో నటించి అవి విడుదలైతేనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని అన్నారు. అంతేకాక సినిమాలో కనీసం ఐదు నిమిషాలైనా డైలాగ్ చెప్పిన వారికి అసోసియేట్ గా సభ్యత్వం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆ అసోసియేట్ సభ్యులుగా ఉన్న వారికి ‘మా’లో ఓటు హక్కు ఉండదని ఆయన పేర్కొన్నారు.
‘మా’కు వ్యతిరేకంగా ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారు సభ్యులుగా ఉండడానికి అనర్హులుగా ప్రకటిస్తామని, ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు తీసుకువెళతామని చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కాని సభ్యులు ఉన్నారని చెప్పగా, మెగా క్యాంపుకి చెందిన వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారాలు సాగుతున్నాయి.
మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా కార్యవర్గ సభ్యులైన ధర్నా చేసినా, మీడియా ముందుకు వెళ్లిన వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని పేర్కొనడం కూడా ఇప్పుడు సంచలనం రేపుతుంది. గతంలో ఒక వ్యక్తి తనను కావాలని డబ్బులు ఇచ్చి మరి మనుషుల్ని పెట్టించి ట్రోల్ చేయిస్తున్నారని ఆరోపించిన మంచు విష్ణు ఆ హీరో ఎవరనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయాలపై నాగబాబు ఏమైన స్పందిస్తాడా అన్నది చూడాలి.