Krishna: ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆ ఫ్యామిలీలో ఇది మూడో విషాదం. జనవరిలో కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించగా, సెప్టెంబరులో కృష్ణ సతీమణి ఇందిరా దేవి, మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. ఇక ఈ రోజు కృష్ణ కూడా మరణించారు.ఇలా వరుస విషాదాలతో సూపర్ మహేష్ బాబు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. కృష్ణ మరణం తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు. ఆయన టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. కృష్ణ మే 31, 1943 వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు.
ట్రెండ్‌సెట్టర్
ఇప్పటి వరకు 340కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ గూఢచారి 116తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు అనేకం. 1964-95 మధ్య ఏడాదికి 10 సినిమాల చొప్పున .. మొత్తం 300 సినిమాలు చేశారు. మూడు షిఫ్టులలో పని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. కృష్ణ సినిమాలలో నటించడంతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా తన టాలెంట్ చూపించారు. ఆయన 18 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కృష్ణ నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు కాగా, ఇది ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. ఇక తొలి జేమ్స్‌బాండ్ చిత్రం అంటే ‘గూఢచారి 116. కృష్ణ తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’.
తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ (తెలుగు వీర లేవరా..).. ఇలా ఎన్నో విభిన్న చిత్రాలతో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 1974లో ఈ సినిమా విడుదలవ్వగా.. ఆ తర్వాత 1975 సంవత్సరం కృష్ణ కెరీర్‌ను కుదేపిసిందనే చెప్పాలి. ఆయన నటించిన 12 సినిమాలు ఫ్లాప్ కావడంతో.. సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక కృష్ణ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో.. సొంత నిర్మాణ సంస్థలో ‘పాడిపంటలు’ మూవీని తీసి మళ్లీ తన సత్తా ఏంటో అందరికి చూపించాడు.
ఎన్టీఆర్‌ను ఢీకొట్టిన కృష్ణ..
టాలీవుడ్ సినీ చరిత్రలో ఆయన పాత్రను ఎన్నటికీ ఎవరు మరచిపోలేరు. 50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానానికి 2017 సంక్రాంతి సందర్భంగా రిటైర్‌మెంట్ ప్రకటించిన కృష్ణ.. తన కొడుకు మహేష్ బాబు, మనవడు గౌతం కృష్ణలతో కలిసి నటించాలని అనుకున్నాడు. కాని ఆ కోరిక తీరకుండానే కన్నుమూసారు. సినిమాల్లో సూపర్‌స్టార్‌గా నిలిచిన కృష్ణ.. రాజకీయాల్లో కూడా తన సత్తా చూపారు. తన సినిమాలతో దిగ్గజ నటుడు ఎన్టీఆర్‌ను ఢీకొట్టిన కృష్ణ.. రాజకీయంగానూ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
1972లో ‘జైఆంధ్ర’ ఉద్యమానికి ఆయన బహిరంగంగా మద్దతునివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి.. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో.. భాస్కరరావును అభినందిస్తూ కృష్ణ పేరిట ఓ ఫుల్‌పేజీ ప్రకటన విడుదలవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
1984లో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరిన కృష్ణ.. 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా విజయదుందుభి మోగించారు.. 1991 మళ్లీ అదేస్థానం నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఆ తర్వాత ఆయన వివిధ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇక 2009 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు తెలిపింది. ఇలా కృష్ణ సినిమా, రాజకీయాలలో రాణించారు.
also read :Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు.. శోక సంద్రంలో అభిమానులు
కృష్ణకు ఐదుగురు సంతానం కాగా, వారిలో ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు రమేష్ బాబు సినిమాల్లో హీరోగా రాణించలేకపోవడంతో , ఆ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. జనవరిలో ఆయన కన్నుమూసారు. ఇక చిన్న కుమారుడు మహేష్ బాబు.. కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని బాలనటుడిగా తెరంగేట్రం చేసాడు. రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.