Telugu Flash News

rukmini kalyanam in telugu : రుక్మిణీ కళ్యాణం కథ తెలుసుకోండి.. ఈ శుభచరిత్ర చదివినవారికి అన్నీ శుభాలే!

rukmini kalyanam

rukmini kalyanam in telugu : పూర్వం విదర్భ అనే దేశంలో కుండిన అనే నగరానికి గొప్ప వీరుడైన భీష్మకుడు ప్రభువు. ఆయనకు గల అయిదుగురు కుమారులలో పెద్దవాడు రుక్మి. అతడు నీతిమాలిన వాడు. వారికి కడగొట్టు చెల్లెలు పుట్టింది. ఆమె పేరు రుక్మిణి. ఆమె చాలా అందచందములు సుగుణములతో పెరిగి పెద్దది అయింది.

ఆమెకు యుక్త వయస్సు రాగా తన తండ్రి ఇంటికి అతిథులుగా వస్తున్నవారు చెప్పగా శ్రీకృష్ణుని చక్కదనము, శక్తి సద్గుణాలు మొదలైనవి విని దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుని పెండ్లాడాలన్న కోరిక కలిగింది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి యొక్క రూపం, వివేకం, సత్ప్రవర్తన, సద్గుణాలు విని ఆమెను వివాహమాడి తనకు భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

గొప్ప మతిమంతులైన బంధువులు అందరు శ్రీకృష్ణునికి రుక్మిణినిని ఇచ్చి పెండ్లి ‘చేయాలని ఆలోచించుచుండగా దుష్టులతో మైత్రిచేసిన రుక్మిణి పెద్దన్న రుక్మి అనేవాడు శ్రీకృష్ణునిపట్ల ప్రబల విరోధం వహించాడు. ఆ మదాంధుడు ఆమెను చేదిదేశానికి రాజైన శిశుపాలునికి కట్టబెట్టాలని సంకల్పించాడు.

తన అన్న యొక్క దుష్ట ఆలోచనను విని రుక్మిణి, రానున్న ప్రమాదం తలచు కొని, తనమేలు కోరే అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిపించి “ఓ విద్వన్మణీ ! గర్వంతో కన్నులుగానక మా పెద్దన్న రుక్మి నన్నిప్పుడు ఏవిధంగానైనా శిశుపాలునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి నీవు ద్వారకాపురికి వెళ్ళి శ్రీకృష్ణునికి నా పరిస్థితి విన్నవించు” అని చెప్పి పంపింది.

ఆ బ్రాహ్మణుడు నడచి ద్వారకా నగరానికి చేరుకొని శ్రీకృష్ణుని ఆతిథ్యం స్వీకరించి, ఆయనతో తాను వచ్చిన వృత్తాంతం చెప్పి “కృష్ణా నీవు వెంటనే సేనతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్రరణంలో ఓడించి, బలాత్కారముగా నన్ను ఎత్తుకొని వెళ్ళి రాక్షస పద్ధతిలో వివాహం చేసుకోమని రుక్మిణి చెప్పిన మాటలను తెల్పాడు.

అంతట శ్రీకృష్ణుడు సరే అని చెప్పి ఆ బ్రాహ్మణుని గౌరవించి. “కుండిన నగరం ప్రవేశించి చిటికలో రుక్మిణిని తీసుకొని రాగలను అడ్డు వచ్చిన శత్రువులను దునుమాడుతాను” అని చెప్పి ఆ ప్రయత్నము మొదలుపెట్టాడు.

అక్కడ కుండినగరంలో భీష్మక మహారాజు శాస్త్రోక్తంగా రుక్మిణికి వివాహ ప్రయత్నం చేయటం మొదలు పెట్టాడు. పట్టణం శోభాయమానంగా అలంకరించబడింది. ఆ సమయంలో మదించిన శిశుపాలుడు రుక్మిణిని వివాహం చేసుకుంటానంటూ మహా ఆటోపంతో కుండినపురానికి వచ్చాడు.

ఇంకా అనేక దేశాల రాజులు ఆ నగరానికి చేరుకున్నారు. కుండిన పురానికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. రుక్మిణిని తీసుకొని వచ్చేటప్పుడు యుద్ధం జరుగుతుంది అప్పుడు తన తమ్మునికి సహాయం అవసరం అవుతుందని బలరాముడు తమ్ముడు వెళ్ళిన మార్గంలో తాను సైన్యాన్ని తీసుకొని వెళ్లాడు.

ఆ లోపల రుక్మిణి కల్లోలితమైన మనసు కలిగినదై “సుముహూర్తం దగ్గరపడుతున్నది. కృష్ణుడు ఇంకా రాలేదు. ఆయన బ్రాహ్మణుని మాటలు విని తప్పుగా భావించాడేమో, నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో దైవనిర్ణయం ఎలా ఉన్నదో” అని పరిపరివిధాల విచారించింది.

ఇంతలో అగ్ని ద్యోతనుడు వచ్చి, “బాలామణీ ! శ్రీకృష్ణుడు నీ గుణగణాలను మెచ్చుకున్నాడు. ఇప్పుడు వచ్చి ఊరిముందు ఉన్నాడు. నిన్ను తీసుకొని పోగలడు” అని చెప్పాడు.

ఆచారం ప్రకారం రుక్మిణీదేవి గౌరీదేవిని అర్చించటానికి అంతఃపురమునుండి సపరివారంగా గుడికి బయలుదేరింది పార్వతీదేవిని ! “అమ్మా ! గౌరీ నాకు పెద్ద తల్లివి, లోకంలో నిన్ను నమ్ముకున్న వారెవరికి చెడుజరుగదు. శ్రీకృష్ణుని నాకు భర్త అయ్యేటట్లు చేయి” అని ప్రార్ధించింది.

ఈ విధంగా నమస్కరించి పూజ చేసికొని కాలినడకతో గుడిబయటకు రాగా, శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి రుక్మిణిని రధం ఎక్కించుకొని ద్వారకా నగర మార్గం పట్టాడు.

అప్పుడు జరాసంధునికి లోబడిన రాజులందరూ శ్రీకృష్ణుడు చేసిన పనిని విని, రోషాలు మనసులు కెక్కినవారై “నిలవండి ! నిలవండి ! అని ధిక్కరించి యాదవ సైన్యంమీదకు ఎత్తివచ్చారు. అయినా యాదవులకు కాలంకలసి వచ్చింది వారిని మనం ఏమీ చేయలేమని భావించి శిశుపాలునికి మనోవేదన తొలిగే మాటలు చెప్పి తమతమ దేశాలకు వెళ్లిపోయినారు.

అప్పుడు రుక్మి తనకు జరిగిన పరాభవాన్ని సహించలేక అక్షౌహిణి సేనతో శ్రీకృష్ణునిని వెంబడించాడు. శ్రీకృష్ణుని అనేక అవమానకర మైన మాటలతో నొప్పించాడు. రుక్మి కత్తి తీసుకొని శ్రీకృష్ణుని మీద పడబోగా, అతడి దౌష్ట్యాన్ని సహింపని శ్రీకృష్ణుడు అతడితల తెగనరకబోగా, తన అన్నను చంపవద్దని రుక్మిణి ప్రార్థించింది. అతనిని పట్టి బంధించి మీసము, గడ్డములను కత్తితో పాయలుగా ఏర్పడే టట్లుగా ఖండించి కురూపిని చేశాడు.

అటు తరువాత కృష్ణుడు బంధువులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఒక శుభసమయాన తన మనస్సును హరించేది, ఆత్మోన్నతి గాంభీర్యం అనే గుణాలతో మెలిగేది, రమణీ శిరోమణి అయిన రుక్మిణిని వివాహం (rukmini kalyanam) చేసుకొన్నాడు. ఈ శుభచరిత్ర చదివినవారికి అన్నీ శుభాలే కలుగుతాయి.

Exit mobile version