Kishan Reddy on KCR : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఈ కేసుపై ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి.. ఇప్పుడు ఈడీ విచారణ సెగ తగులుతోంది. మరోవైపు కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను పక్కనపెడుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఈ కేసుపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఏకంగా ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ బండారం బయటపెట్టాననే అక్కసుతో తనపై బీజేపీ పెద్దలు కక్షగట్టారని రోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసు బయట పడిన నాటి నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ దాచిపెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ కేసులో పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి స్పందించారు.
సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో రూపొందిన ఫామ్ హౌస్ ఫైల్స్ మూవీలో పసలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కథ, స్క్రీన్ ప్లే విఫలమైందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. పైసలే లేనప్పుడు ఈడీ ఎలా విచారిస్తోందని స్వయంగా ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ తాను నవ్వులపాలవుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దేశ వ్యాప్తంగా నవ్వులపాలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
వారిని ఎందుకు బంధించారు?
కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా చేర్చుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు రికవరీ చేయలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు దాచిపెట్టుకోవాల్సి వచ్చిందని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. నాలుగు వారాల పాటు నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌లో బంధించారని, ఇక్కడే కేసీఆర్ కుట్ర బట్టబయలైందని చెప్పారు. కేసులో సిట్ దర్యాప్తును తప్పించి.. సీబీఐకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు