Telugu Flash News

Karnataka News : పెళ్లికోసం కర్ణాటకలో 200 యువకుల పాదయాత్ర..

unmarried men to go on padayatra in Karnataka News : దేశంలో పెళ్లికాని యువకుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు కారణాలు చాలానే ఉంటున్నాయి. అమ్మాయిలు కెరీర్‌ పరంగా కాస్త బెటర్‌ వెతుక్కుంటుండటం, పెళ్లీడుకొచ్చినా యువకులు జీవితంలో సెటిల్‌ కాకపోవడం, కుటుంబ బాధ్యతలు, ఇంట్లో పెద్దలు పెళ్లి గురించి పట్టించుకోకపోవడం, సరైన ఈడు జోడు దొరక్కపోవడం, ఆర్థిక పరిస్థితులు.. ఇలా రకరకాల కారణాలతో వందలో సుమారు పది మంది వరకు పెళ్లిళ్లు జరగడం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులకు కాస్త బెటర్‌గానే పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయి. ఇందులోనూ ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ లేఆఫ్స్‌ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో యువల పెళ్లిళ్లపై ప్రభావం పడుతోంది. తాజాగా కర్ణాటకలో తమకు పెళ్లి కాలేదని రైతు కుటుంబాలకు చెందిన 200 మంది యువకులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. విచిత్రమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన ఈ యువకులు.. తమకు పెళ్లి కావాలన్న కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రముఖ శైవ క్షేత్రం మలెమహదేవన బెట్టకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. మండ్య నుంచి సుమారు 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర జిల్లాలో బెట్ట ఉంది. వీరంతా ఈనెల 23వ తేదీన పాదయాత్రగా బయల్దేరనున్నారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకా కేఎం దొడ్డి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వీరంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువకులు. అందరికీ సుమారు పదెకరాలకుపైగా భూములున్నాయి.

ఏడాదికి మూడు పంటల సాగుతో బాగా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ పెళ్లి విషయానికి వచ్చే సరికి.. వధువులు దొరకడం లేదు. స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా, ఇతర ప్రాంతాలవారు ఇక్కడకు పిల్లలను ఇవ్వకపోవడంతో తమకు సరైన వయసులో పెళ్లిళ్లు కాలేదని ఈ యువకులు చెబుతున్నారు.

వీరంతా 30-34 ఏళ్ల వయసు కలిగిన బ్రహ్మచారులు. బ్రహ్మచారుల పాదయాత్ర పేరిట తాము యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బెంగళూరు, మైసూరు, మండ్య, శివమొగ్గ జిల్లాల నుంచీ 100 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. మరి వీరి మొరను మహాశివుడు విని పెళ్లిళ్లు అయ్యేలా ఆశీర్వదిస్తాడేమో చూడాలి.

also read :

radish for diabetes : డయాబెటిస్‌ బాధితులకు ముల్లంగి వైద్యం!

Samantha: స‌మంత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది..!

 

Exit mobile version