Karnataka IAS, IPS Officers News : కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల రచ్చ వీధికెక్కింది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వారిద్దరిపై శాఖా పరమైన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమైంది. తాజాగా ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరికి చెందిన పర్సనల్ ఫొటోలను ఐపీఎస్ అధికారి డి.రూపా మౌద్గిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను గతంలోనూ రోహిణి పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారంటూ రూపా ఆరోపించారు.
ఇలా చేయడం ద్వారా వృత్తిపరమైన నియమాలను ఉల్లంఘించారంటూ మండిపడ్డారు. 2021 నుంచి 2022 మధ్య ఈ ఫొటోలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసినట్లు ఆరోపణలు గుప్పించారు. దీంతోపాటు అవినీతికి సంబంధించిన ఆరోపణలు కూడా చేశారు. ఈ వ్యవహారంపై తాను ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు పిర్యాదు కూడా చేశానని ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలపై రోహిణి సైతం అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు.
రూపా తనపై పర్సనల్‌గా దూషణలకు దిగుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు ఆమె ఇలా సోషల్ మీడియా, వాట్సప్ స్టేటస్ స్క్రీన్ షాట్లను సేకరించారని మండిపడ్డారు. తాను వీటిని కొందరికి పంపినట్లు ఆమె అంటున్నారని, ఆ వ్యక్తులెవరో బహిర్గంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పారు. వైద్యుల సహకారంతో మానసిక సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలా అనారోగ్యంతో బాధపడటం సరైంది కాదని, చాలా ప్రమాదకరమంటూ సెటైర్లు వేశారు.
రూపాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇలా ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు వీధికెక్కి సోషల్ మీడియాలో యుద్ధం చేయడంపై ప్రభుత్వం మండిపడింది. వారి ప్రవర్తనలపై చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. ఇద్దరు సామాన్యులు కూడా ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోరని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధాలు ఉన్నా మీడియా ఎదుట కాస్త బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు. కర్ణాటక హస్తకళల అభిశృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా రూప పని చేస్తున్నారు. అలాగే సింధూరి దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.
also read :
Baahubali: బాహుబలి ప్రీక్వెల్‌కి సన్నాహాలు జరుగుతున్నాయా ?
Varun Tej: మరోసారి వార్తలలోకి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి…!