Karnataka Election Results: కర్ణాటక కాంగ్రెస్ వశమైంది. ఏకంగా 136 సీట్లలో విజయకేతనం ఎగుర వేసింది. సంచల విజయం అందుకొని జోరు పెంచింది కాంగ్రెస్. మరోవైపు బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని కమలనాథులు అంచనా వేయలేకపోయారు. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113 వద్దకు సమీపంలోకి వచ్చి ఆగిపోయినా.. జేడీఎస్ సాయంతో ప్రభుత్వాన్ని స్థాపించేయాలన్న ఆలోచనతో బీజేపీ ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఎవరి మద్దతూ అవసరం లేకుండా కాంగ్రెస్ సొంతంగా ఘన విజయం అందుకుంది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మతం అంశం కీలకంగా తెరపైకి వచ్చింది. ఈసారి హనుమంతుడు కూడా ప్రచారంలో భాగం కావడం విశేషం. ప్రచారం చివరి దశలో ఉండగా, కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో అగ్గిరాజేసింది. బజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామంటూ హామీ ఇవ్వడం కలకలం రేపింది. అప్పటి నుంచి అక్కడి రాజకీయాలన్నీ హనుమంతుడి చుట్టూ తిరిగాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ.. జై బజ్రంగ్ బలి నినాదాలను ఇచ్చారు. కాంగ్రెస్‌పై యాంటీ హిందూ ముద్ర వేసే ప్రయత్నాలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో బజరంగ్దళ్ కార్యకర్తలు కూడా నిరసనలు తెలిపారు.
ఈ ఘటనతో హిందువులంతా కాంగ్రెస్‌కు దూరమవుతారని బీజేపీ నాయకత్వం భావించింది. అయితే, తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా స్పందించి బజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేసే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ బీజేపీ హిందూ కార్డు చూపుతూ ప్రచారంలో దూకుడు పెంచింది. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఏమీ చేయలేదని ప్రధాని ఆరోపించారు. ఆ పాలనలోని స్కామ్‌లన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. ఎప్పటి కన్నా ఎక్కువగానే విమర్శలు చేస్తూ ప్రధాని ప్రచారం సాగింది.
అయితే, బీజేపీ మత రాజకీయాలు, బజరంగ్దళ్ నినాదాన్ని వాడుకుందామనే ఆలోచన, హనుమంతుడి పేరుతో లబ్ధి పొందాలని చూడటం.. ఇవన్నీ పని చేయలేదని, కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారంటూ నేతలు ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. అసలు ప్రజలు ఆ విషయాలనే పట్టించుకోలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు లింగాయతుల్లో చీలిక రావడం, గాలి జనార్ధనరెడ్డి పార్టీ పెట్టి 15 మందితో పోటీ చేయడం కూడా బీజేపీని దెబ్బతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి బొమ్మై 40 శాతం కమిషన్లు తీసుకుంటున్నారనే నినాదాన్ని కూడా కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని చెబుతున్నారు. మొత్తంగా కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లుగా బీజేపీ ఓటమికి సవాలక్ష కారణాలు తేలుతున్నాయి.
Read Also : Bigg Boss: బుల్లెట్ తగలడంతో గాయపడ్డ బిగ్ బాస్ విన్నర్.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది?