Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ ఇచ్చింది న్యూయార్క్ కోర్టు. యూఎస్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను లైంగిక వేధింపుల కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ పోర్న్ స్టార్‌తో అనైతిక ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలపై ఆయన అరెస్టయ్యి విడుదలయ్యారు. అయితే, ఈ వివాదం ముగియక మునుపే.. తాజాగా ఇంకో కేసులో ఆయనకు ట్విస్ట్ ఎదురైంది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్‌పై డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఈ మేరకు ఇది వాస్తవమేనంటూ న్యూయార్క్ కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు 5 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 41 కోట్ల రూపాయలు ట్రంప్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక 1990 కాలంలోనే ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్ ఇటీవల ఆరోపణలు ఉగప్పించారు. ఇదే అంశంపై న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ తీర్పును వెల్లడించింది.
ఈ సందర్భంగా తనపై అత్యాచారం జరిగిందన్న కారొల్ ఆరోపణలను జ్యూరీ తోసిపుచ్చారు. అయితే ఆమెపై లైంగిక వేధింపులకు ట్రంప్ బాధ్యుడేనని పేర్కొంది. ఇందుకు పరిహారంగా ఆ కాలమిస్ట్‌కు ట్రంప్ 5 మిలియన్ డాలర్లు కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, తనపై వస్తున్న ఆరోపణలపై ట్రంప్ స్పందించారు. ఈ విచారణకు కూడా ట్రంప్ గైర్హాజరయ్యారు. కాగా, జ్యూరీ తీర్పుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పును చూసి సిగ్గుపడాలంటూ వ్యాఖ్యానించారు.
అన్ని వేళల్లో తనపై పెద్ద కుట్ర జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. అసలు ఆ మహిళ ఎవరో కూడా తనకు తెలియదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు ట్రంప్.1996లో మన్‌హట్టన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో కారొల్‌కు ట్రంప్ పరిచయం అయ్యారు.
అప్పుడు వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలంటూ ట్రంప్ తనతో మాట కలిపారని కారొల్ ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ ఘటనతో తన మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. అయితే, బాధితురాలిగా తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేకపోయానన్నారు.
Read Also : Karnataka: కర్ణాటకలో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..