Joe Biden warns China over threats to US : అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఇటీవల చైనా గూఢచార నిఘా బెలూన్ వ్యవహారంతో ఇది మరింత ముదిరింది. తాజాగా అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడు బైడెన్ ప్రసంగం చేశారు. ఇందులో చైనాపై పలు వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ప్రపంచ పురోభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై చైనాతో కలిసి పని చేయడానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించారు.
తప్పులు జరిగితే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి తాను వెనుకాడే ప్రశ్నే లేదని బైడెన్ తేల్చి చెప్పారు. చైనా స్పై బెలూన్ పేల్చివేతే ఇందుకు ఉదాహరణగా పరోక్షంగా చెప్పారు. తాము చైనాతో పోటీ మాత్రమే కోరుకుంటున్నామని, ఘర్షణ పడదల్చుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ అధినేత జిన్‌పింగ్‌కు గతంలోనే స్పష్టం చేసినట్లు బైడెన్ వెల్లడించారు. సైనిక శక్తితోపాటు అన్ని రకాలుగా అమెరికా అత్యంత దృఢంగా ఉందని, చైనాతోనే కాకుండా ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలమని స్పష్టీకరించారు.
బైడెన్ ప్రసంగం మొత్తం 73 నిమిషాల పాటు సాగింది. ఇందులో మొత్తం ఏడు సార్లు చైనా పేరును ప్రస్తావించడం గమనార్హం. ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంశంపైనా బైడెన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడి ప్రపంచానికే పరీక్షలా మారిందని బైడెన్ చెప్పారు. అయితే, తాము ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తున్నామని బైడెన్ స్పష్టం చేశారు.
కరోనా విలయంలో చిక్కుకున్న అమెరికా.. రెండేళ్ల కిందట ఆర్థిక పరిస్థితి కూడా ఛిన్నాభిన్నంగా మారిందని బైడెన్ తెలిపారు. ప్రస్తుతం కోలుకున్నామని, మాజీ అధ్యక్షుడు నాలుగేళ్లలో కల్పించిన ఉద్యోగాలు తాను రెండేళ్లలోనే సృష్టించినట్లు బైడెన్ చెప్పారు. మరోవైపు బైడెన్ ప్రసంగంపై చైనా రెస్పాండ్ అయ్యింది. అగ్రరాజ్యంతో పోటీకి తాము భయడటం లేదని చైనా పేర్కొంది. కేవలం ఆ కోణం నుంచే చూడటం అభ్యంతరకరమని డ్రాగన్ కంట్రీ వ్యాఖ్యానించింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుకు కృషి చేయాలని చైనా సూచించింది.
also read:
PT Usha: రాజ్యసభలో అరుదైన సన్నివేశం.. సభను నిర్వహించిన పీటీ ఉష
Samantha: భారీ రేటుతో ముంబైలో ప్లాట్ కొన్న సమంత..!