Telugu Flash News

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి బైడెన్‌..

joe biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden).. మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అంటే 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మళ్లీ తానే అధ్యక్షుడిగా అవ్వాలని జో బైడెన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు స్వయంగా బైడెనే సంకేతాలు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా నిలుస్తోంది. యూఎస్‌లో తాజాగా ఉద్యోగాలు భారీగా పెరిగాయని వార్షిక నివేదిక వెలువడింది. ఈ నేపథ్యంలో బైడెన్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగాలపై వార్షిక నివేదిక విడుదల సందర్భంగా యూఎస్‌లో శుక్రవారం పాలక డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బైడెన్‌ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని స్పష్టం చేశారు. శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంలో సఫలీకృతమైనట్లు వెల్లడించారు. అనేక మౌలిక సదుపాయాల కల్పనలో విజయం సాధించామని బైడెన్‌ పేర్కొన్నారు.

దేశంలో ఆరోగ్య సేవలను అత్యద్భుతంగా మెరుగుపరిచామని బైడెన్‌ చెప్పారు. హరిత సాంకేతికతలపై భారీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నట్లు బైడెన్‌ అన్నారు. మీరంతా నాకు అండగా ఉంటారా.. అంటూ బైడెన్‌ చిరునవ్వుతో ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రతినిధులు ఫోర్‌ మోర్‌ ఇయర్స్‌.. ఫోర్‌ మోర్‌ ఇయర్స్‌.. అంటూ నినాదాలు చేశారు.

సాధారణంగా అమెరికా అధ్యక్ష పదవి నాలుగేళ్లు ఉంటుంది. ప్రతిపక్ష రిబప్లికన్‌ పార్టీ తరఫున తాను పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఇప్పటికే మాజీ ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే, అదే పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ కూడా అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక డెమోక్రటిక్‌ పార్టీ తరఫున వచ్చేసారి అధ్యక్ష అభ్యర్థుల ఎంపికకు పార్టీలో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే అందుకు షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో తానే వచ్చే సారి బరిలోకి దిగనున్నట్లు బైడెన్‌ సంకేతాలివ్వడం గమనార్హం.

also read:

పదో తరగతి విద్యార్థి ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారు చేశాడు!

Siddharth – Aditi ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టేనా!

Exit mobile version