Telugu Flash News

Javed Akhtar : పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించిన జావేద్‌ అక్తర్.. వీడియో వైరల్‌!

Javed Akhtar on 26/11 attack : పాకిస్తాన్‌ను ఆ దేశంలోకి వెళ్లి విమర్శించిన వారు అరుదుగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్‌ అక్తర్‌ ఇదే పని చేసి వార్తల్లో నిలిచారు. 26/11 ముంబై ఉగ్రపేలుళ్ల ఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో ముంబై ఉగ్ర దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్‌లోనే స్వేచ్ఛగా తిరుగాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అయిపోయాయి.

ఉర్దూ కవి ఫైజ్‌ అహ్మద్‌ స్మారకార్థం ఇటీవల లాహోర్‌లో ఫైజ్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జావెద్‌ అక్తర్‌ను ఆహ్వానించారు. దీంతో ఆయన పాకిస్తాన్‌కు వెళ్లారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్ సంబంధాలు, ముంబై ఉగ్రదాడులను గుర్తు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్నారు.

ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. తాము ముంబైకి చెందిన వాళ్లమన్నారు. తమ నగరంలో ఉగ్రవాదులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో కళ్లారా చవిచూశామన్న జావెద్‌.. ఉగ్రవాదులు నార్వే లేదా ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదని వ్యాఖ్యానించారు. వాళ్లు ఇంకా పాకిస్తాన్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌ దీని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు ఈ అంశాన్ని నెగిటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.

మరోవైపు భారతదేశానికి చెందిన ఆర్టిస్టులను పాకిస్తాన్‌లో గౌరవం ఇవ్వకపోవడాన్ని జావెద్‌ తీవ్రంగా ఖండించారు. నుశ్రత్‌ ఫతే అలీ ఖాన్‌, మెహదీ హసన్‌ లాంటి పాక్‌ కళాకారుల గౌరవం కోసం తాము కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అయితే, లతా మంగేష్కర్‌ కోసం పాకిస్తాన్‌ ఎప్పుడైనా కార్యక్రమాలు నిర్వహించిందా? అని జావెద్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

also read :

Jobs : నెలకు 4 లక్షల జీతం.. ఎవరూ ముందుకు రావడం లేదు.. కారణం ఏంటి?

Supreme Court : వివాహ వయసు పెంచే అధికారం మాకు లేదు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు!

 

Exit mobile version