Telugu Flash News

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు నాలుగో భార్య కావడానికి సిద్ధం.. యూకే టిక్‌టాకర్‌ ప్రపోజల్

Imran Khan: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు వింత ప్రపోజల్‌ వచ్చింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు సిద్ధమంటూ ఓ మహిళ ప్రతిపాదించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లుగా ఇమ్రాన్‌ఖాన్‌ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయనకు జైలు శిక్ష పడగా.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ఖాన్‌.. అప్పటి నుంచి పాకిస్తాన్‌లో గడ్డు పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. కేసులో అరెస్టులతో ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి తరుణంలో ఆయనకు ఊహించని ప్రపోజల్‌ వచ్చింది. యూకేకు చెందిన ఓ టిక్‌టాకర్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌ను పెళ్లాడటానికి సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు ఇమ్రాన్‌కు ప్రపోజ్ చేసిన ఆమె.. ఆయన నాలుగో భార్యగా ఉండటానికి సిద్ధమని చెప్పింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. యూకేకు చెందిన జియా ఖాన్‌ అనే టిక్‌టాకర్‌ ఈ మేరకు ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రపోజ్ చేసింది. షార్ట్‌ వీడియో రిలీజ్‌ చేసిన సందర్భంగా ఇమ్రాన్‌పై మనసు పారేసుకున్నట్లు ఆ వీడియోలో జియా ఖాన్‌ చెప్పింది.

వీడియోలో జియా ఖాన్‌ మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ ఖాన్‌ తొలుత జెమీమాను వివాహం చేసుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చిందని జియా ఖాన్‌ గుర్తు చేసింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను ఆయన మనువాడాడని చెప్పింది. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్‌ నింపాల్సిన అవసరం ఉందంటూ జియా ఖాన్‌ పేర్కొనడం గమనార్హం. ఆయనకో అల్లరి చేసే సరదాలు పంచే భార్య కావాలని, తాను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటూ తన మనసులో మాట బయట పెట్టింది జియా ఖాన్.

నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నాని వెల్లడించింది. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా తాను సిద్ధమేనంటూ సంచలన ప్రకటన చేసింది. ఇమ్రాన్‌ వయసు 70 ఏళ్లని.. అయినా తనకేం ఇబ్బంది లేదంది. ఎందుకంటే ఆయన ఇమ్రాన్‌ ఖాన్‌.. అంటూ జియా ఖాన్‌ ఆ వీడియోలో ఆయనపై ప్రేమ వ్యక్తం చేసింది. కాగా, బుష్రా బీబీతో ఇమ్రాన్‌ వివాహం చెల్లదంటూ ఇటీవల ఓ మత పెద్ద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పటి దాకా స్పందించలేదు. ఇప్పటికే వందకుపైగా కేసులను ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ను ఇటీవల పాక్‌ పారామిలటరీ వింగ్‌ అరెస్టు చేయడంతో సంచలనం రేకెత్తింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.

Read Also : Imran Khan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు

Exit mobile version