Narendra Modi: అభివృద్ధి చెందిన దేశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నమ్మిన వాళ్లే సాయం చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను నమ్మకం ఉంచిన దేశాలు ఆపద కాలంలో అండగా నిలవకపోవడం బాధాకరమన్నారు. పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడో సదస్సులో మాట్లాడారు. గ్లోబల్ సౌత్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని ప్రధాని మోదీ తెలిపారు. వాతావరణంలో కలుగుతున్న మార్పులు, ఆకలి, పేదరికం, వైద్యపరమైన సమస్యలు ఎలాగూ అదనమన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇంధనం, ఫుడ్, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థ బాగా దెబ్బ తినిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభావాన్ని అందరూ అనుభవిస్తున్నారని తెలిపారు. మరోవైపు కొత్త సమస్యలు రానే వస్తున్నాయని, ఇంతటి క్లిష్ట పరిస్థితుల నడుమ తాము నమ్మిన వారు తమతో నిలబడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మోదీ. అయితే, ఇండియా మాత్రం పసిఫిక్ ప్రాంత దేశాలకు అండగా నిలవడంపై సంతోషంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఎలాంటి సంకోచం లేకుండా పసిఫిక్ దేశాలతో తన అనుభవాలను, సామర్థ్యాన్ని పంచుకోవడానికి ఇండియా సంసిద్ధంగా ఉందని నరేంద్ర మోదీ చెప్పారు. తన దృష్టిలో పసిఫిక్ ద్వీప దేశాలు.. మహాసముద్రం పరిధిలోని పెద్ద దేశాలని మోదీ అభిప్రాయడ్డారు. చిన్న ద్వీప దేశాలు ఏమాత్రం కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సదస్సులో భాగంగా గినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ప్రసంగించారు. ప్రపంచ వేదికపై భారత్ నాయకత్వాన్ని ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ఇక ఇండియా అందిస్తున్న సాయానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అగ్రదేశాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. గ్లోబల్ సౌత్‌కు భారత్ నాయకత్వం వహిస్తుండడం సంతోషకరమన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఇండియాకు తాము వెన్నంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తమ మధ్య ఫలవంతమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయని ఇరుదేశాల నేతలు పేర్కొన్నారు.
అలాగే తమిళ ప్రఖ్యాత ‘తిరుక్కురల్’గ్రంథానికి గినియా స్థానిక భాషలో చేసిన అనువాదాన్ని ఇరువురు నేతలు ఆవిష్కరించారు. అంతకుముందు పపువా న్యూగినియాకు చేరుకున్న మోదీకి సాదర స్వాగతం లభించింది. జేమ్స్ మరాపే.. మోదీకి పాదాభివందనం చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆత్మీయ ఆలింగనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Also : Modi with Zelensky: యుద్ధం సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.. జెలెన్‌స్కీతో మోదీ