Ind vs SA: ఆస్ట్రేలియాపై రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు సౌతాఫ్రికాపై కూడా హవా కొనసాగిస్తుంది. తిరువనంతపురం వేదికగా భారత్- సౌతాఫ్రికాల మధ్య తొలి టీ20 జరగగా,ఈ మ్యాచ్‌లో భారత బౌలర్స్ విజృంభించడంతో సౌతాఫ్రికా తక్కువ పరుగులే చేసింది.
ఒకానొక దశలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 50 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కాని మర్‌క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహారాజ్ (41) విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అర్షదీప్ ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం విశేషం.
సునాయాసంగా గెలిచిన భారత్
ఇక 107 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 17 పరుగులకే రోహిత్, విరాట్ కోహ్లీల వికెట్లు కోల్పోయి డేంజర్‌లో పడింది. అయితే ఎప్పటిలానే సూర్యకుమార్ యాదవ్ తనదైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కి విజయం దక్కేలా చేశాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తొలి సిక్స్ బాదగానే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా సూర్యకుమార్ సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రాహుల్ కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ ఏడాది సూర్య 180కి పైగా స్ట్రైక్ రేట్‌తో, 40కి పైగా యావరేజ్‌తో పరుగులు చేస్తుండటం గమనార్హం. సౌతాఫ్రికాపై రెండో సిక్స్ బాదగానే టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ రికార్డ్‌ని తుడిచేసి తన పేరిట ఆ రికార్డ్‌ని లిఖించుకున్నాడు.
సౌతాఫ్రికాపై ఐదు సిక్సులు బాదిన సూర్య.. అంతకు ముందు ఆసీస్‌తో జరిగిన ఉప్పల్ టీ20లోనూ ఐదు సిక్సులు బాదడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు.