సాధారణంగా చాలా మంది వారానికి ఒకసారో, రెండు సార్లో ఉపవాసం (Fasting) చేస్తుంటారు. ఇది శతాబ్దాలుగా అనేక సంస్కృతులు, మతాలలో ప్రధానమైనది. ఎవరి మతానికి సంబంధించిన వారి పద్దతుల్లో ఆ దేవుడిని ఉపవాస దీక్షలు చేస్తారు.
అయితే.. ఈ ఉపవాసం పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉపవాసం బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తప్రవాహంలోకి కీటోన్‌లను విడుదల చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందట.
అదే విధంగా ఒత్తిడిని తగ్గంచి రక్తపోటును నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటితో పాటు తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వారంలో రెండు సార్లు ఉపవాసం ఉండటం వల్ల క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.
ఉపవాసం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైండి. ఇక వారానికి రెండు రోజులు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధకులు తెలిపారు.
న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఎలుకలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో.. వారానికి రెండు సార్లు ఉపవాసం పాటించడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని తేలింది. దీంతో ఉపవాసంతో బరువు తగ్గడమే కాదు ఆరోగ్యంగా ఉండవచ్చని తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.