Hyderabad: కొత్త ఏడాదిలో భారత్ శ్రీలంక జట్టుతో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ 20 సిరీస్ గెలిచిన ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ జనవరి 15తో ముగియనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1వరకు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది.. అయితే.. ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్ జనవరి 18న ఉప్పల్ వేదికగా జరగనుండగా, ఈ నేపథ్యంలో టిక్కెట్ల అమ్మకాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కీలక ప్రకటన చేసింది.
దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వన్డే మ్యాచుకు ఆతిథ్యము ఇవ్వనుంది. చివరిసారిగా 2019, మార్చి 2న భారత్ v ఆస్ట్రేలియా జట్లు ఉప్పల్ వేదికగా తలపడగా, సుదీర్ఘకాలం అనంతరం మ్యాచ్ జరుగుతుండడంతో అభిమానుల తాకిడి భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతేడాది ఆసీస్తో టీ20 మ్యాచ్ సందర్భంగా టికెట్ల విక్రయంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని అజారుద్దీన్ తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం ద్వారా) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు.
13, 14, 15, 16న ఆన్లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచనుండగా, ఈసారి ఆఫ్ లైన్ లో టిక్కెట్ విక్రయాలు ఉండబోవని స్పష్టం చేసారు. స్టేడియం కెపాసిటీ 39,112 కాగా, ఇందులో 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.. ఒక్కరికి గరిష్టంగా 4 టిక్కెట్లు ఇవ్వనున్నారు. ఆన్లైన్లో టికెట్లుబుక్ చేసుకున్నా.. మ్యాచ్కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి కావడంతో ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. టికెట్ బుక్ చేసుకున్న వివరాలు చూపిస్తే.. ఫిజికల్ టికెట్ ఇవ్వనున్నారు. కాగా, న్యూజిలాండ్ జట్టు జనవరి 14న హైదరాబాద్కు రానుండగా, భారత జట్టు జనవరి 16న నగరానికి చేరుకోనుంది. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా, టీ20 మ్యాచులు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.