vastu shastra : గృహంలో నివసించే వారికి సర్వ శ్రేయస్సులు కలగడానికి శాస్త్రవేత్తలు గృహ నిర్మాణానికి మొదట భూ పరీక్ష చేయాలని తెల్పారు. ఈ భూ పరీక్షలో ‘రస వర్ణ స్పర్శ గందైహి’ అనగా రుచి రంగు స్పర్శ వాసన మొదలగు వాటి వలన ఆ ప్రదేశము నివాస యోగ్యమో కాదో తెలుసుకోవాలి. గృహ నిర్మాణ స్థలం మధ్య భాగంలో ఒక చిన్న గొయ్యి త్రవ్వి అందలి అడుగు భాగాన గల మట్టిని తీసి దాని రంగు రుచి – వాసన ఎట్లున్నదో వాస్తు శాస్త్రజ్ఞుడు చక్కగా పరీక్షించి వాటి ఫలితాలు ఈ విధంగా తెల్పాలని శాస్త్రాలు చెప్పుతున్నాయి.
ఎలా తెలుసుకోవాలి ?
రుచి : భూమి తీయగాను, చేదుగాను, పులుపుగాను, కారంగాను ఉంటుందని చెప్పబడింది. వీటిలో తీపి, చేదుగా ఉన్న నేలలు శ్రేష్ఠమైనవి.
రంగు : తెలుపు రంగు భూమి, ఎర్రని రంగు భూమి, పసుపు రంగు భూమి, నలుపు రంగు భూమి అని 4 రకములు. వీటిలో తెలుపురంగు, ఎరుపురంగు శ్రేష్ఠమైనవి. పొగరంగు కలిగిన భూమి, అనేక రంగులు కల భూమి, మిక్కిలి చిక్కని రంగులు గల భూమి మంచివి కావు.
స్పర్శ : మెత్తని మట్టి కలిగిన భూములు మంచివి. కఠినంగా నున్నది, అతి వేడిగాగాని అతి చల్లగా గాని ఉండే భూములు మంచివి కావు.
వాసన : భూమి నేయి వాసన, రక్తం వాసన, అన్నం వాసన, కల్లు వాసన వచ్చే భూములుగా ఉంటాయని చెప్పబడింది. వీటిలో నేయి వాసన, రక్తము వాసన కలిగిన భూమి శ్రేష్ఠమైనది.
మొక్కలు : దర్భ మొక్కలతో నున్న స్థలం బ్రాహ్మణ స్థలమని, వెదురు చెట్లతో నున్న స్థలం క్షత్రియ స్థలమని, రెల్లుతో నున్న స్థలం వైశ్య స్థలమని, పలు రకముల గడ్డితో నున్న స్థలం శూద్ర స్థలమని భావించాలి. కుశయుక్తమైన స్థలం శ్రేష్ఠమైనది. వెదురుతో యుక్తమైన స్థలం మధ్యమం.
శబ్దం : గుఱ్ఱం, ఏనుగు, వెదురు, వీణ, సముద్రం, భేరి వంటి ధ్వనిని పోలిన ధ్వని గల స్థలం ప్రశస్తమైనది. కీచురాయి ప్రతిధ్వని, భయంకర ధ్వని మొదలగు శబ్దాలు గల స్థలం నింద్యమైనది.
ఆకారం : 1. ఆయతం, 2. చతురస్రం, 3. వృత్తం, భద్రాసనం, 5. చక్రం, 6. విషమ బాహువు, 7. త్రికోణం, శకటం, 9. దండం, 10. పణవం, 11. మురజం, బృహన్ముఖం, 13. వ్యజనం, 14, కూర్మ పృష్టం, 15. ధనసు 16. శూర్ప అని పదహారు విధాలు.
ఈ స్థలాల ఆకారాన్ననుసరించి శుభాశుభ ఫలితాలుంటాయి. వెడల్పు కన్నా పొడవు ఎక్కువగా ఉన్న స్థలం ఆయతాకార స్థలమని, వెడల్పు పొడవు సమంగా ఉన్న స్థలం చతురస్రపు స్థలమని పిలుస్తారు. వర్తులంగా నున్నస్థలం వృత్తాకార స్థలమని పిలుస్తారు. ఇవి శుభాన్ని, ధనం లాభాన్ని కలిగిస్తాయి. గృహ నిర్మాణాలకు యోగ్యమైనవి. వృత్తాకార స్థలం విద్యాలయాలకు, క్రీడా స్థలాలకు ఉత్తమం.
రూపం (ఎత్తు): గంభీరమైన రూపం గల స్థలం బ్రాహ్మణ స్థలం, ఉన్నతంగా ఉన్న స్థలం క్షత్రియ స్థలం, ఎత్తుపల్లాలు లేకుండా సమానమైన రూపం కలిగిన స్థలం వైశ్య స్థలం, వికటంగా నున్నచో శూద్ర స్థలంగా నిశ్చయించాలి గంభీర రూపం గల స్థలం ఉత్తమం. ఉన్నత (ఎత్తు) రూపం గల స్థలం మధ్యమం, సమరూపం గల స్థలం అధమం.
ఏ రకమైన భూమి నివాస యోగ్యం ?
దీర్ఘచతురస్రముగా యున్న భూమి తూర్పు పడమర పొడవు కంటే దక్షిణోత్తరముల పొడవు యెక్కువగా నుండుట శ్రేష్ఠము. దక్షిణోత్తరముల కొలత కంటే తూర్పు పడమరల కొలత ఎక్కువగా ఉండుట మధ్యమము. నలుదిశల సమానము గల భూమి ధనవృద్ధి సర్వకార్య జయము కలుగజేయును. ఈశాన్య దిశ స్థలము పెరిగియున్న ఐశ్వర్యము, వంశవృద్ధి, కుటుంబవృద్ధి కలుగజేస్తుంది. ఈశాన్య స్థలము తగ్గియున్న ధననష్టం, దరిద్రం, సంతాన నష్టం కలుగజేస్తుంది. తూర్పుతో కలిసి ఈశాన్య దిశ పెరిగియున్న స్థలంలో నివసించు వారికి వంశవృద్ధి, ఐశ్వర్యం మొదలగునవి కలుగును. ఉత్తరంతో కలిసి ఈశాన్యం పెరిగి యున్న ఐశ్వర్యం, ధనవృద్ధి మొదలగునవి కలుగును. తూర్పుతో కూడిన ఆగ్నేయం పెరిగియున్న అల్పసంతతి కలుగును.