తిండి తినకుండా కొన్ని రోజులు బ్రతకవచ్చు. కానీ నీళ్ళు (water) త్రాగకుండా బ్రతకలేము. శరీరం బరువులో మూడింట రెండొంతులు (60 – 70 శాతం) నీళ్ళే ఉంటాయి.
నీరు లేకుండా శరీరంలో ఏ పనులూ జరగవు. నీళ్ళు త్రాగకుండా ఐదు రోజులకు మించి ఉంటే ప్రాణాపాయం జరుగుతుంది.
రక్తం తయారు కావటానికీ, ఇతర స్రావాలు / ద్రవాల (లాలాజలం, వీర్యం, చీమిడి, కన్నీరు వగైరా) తయారీకి, శరీరంలో జీవ రసాయన క్రియలు జరగటానికీ, పోషక పదార్థాల రవాణాకూ, మలిన పదార్థాలను, చెమట, మల, మూత్ర రూపంలో విసర్జించటానికీ నీరు అవసరం.
మనం తిన్న ఆహారాన్ని మెత్తబరచి ప్రేవులలో శోషింప (Absorption) చేయటానికి నీరు కావాలి.
శరీరంలో జీవక్రియల వలన (స్వేదం, మలమూత్రాదులు) లోపించిన నీటిని తిరిగి భర్తీ చేయటానికి, రక్త ప్రసరణ సమయంలో కలిగే ఒత్తిడిని తగ్గించటానికి – నీరు కావాలి.
శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దం చేయటానికి నీరు అవసరం. చెమటోడ్చేలా కాయకష్టం చేసినా, వ్యాయామం చేసినా – శరీరంలో ఎక్కువ ఆహారం ఖర్చయ్యి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో ఉత్పత్తయిన మలిన పదార్థాలని నీరు తనతో కలుపుకొని చెమటగానూ, మూత్రంగానూ బయటకొస్తుంది. దీంతో మలిన పదార్థాల విసర్జనా, చెమట ఆవిరయ్యే క్రమంలో శరీర ఉష్ణోగ్రతను చల్లబరచి క్రమబద్ధం చేయటమూ రెండూ జరుగుతాయి.
పెరిగే / ఎదిగే వయసులో నూతన కణజాల నిర్మాణానికి ఎక్కువ నీరు కావాలి. కాల్షియం ఫాస్ఫేట్ – నీటినుపయోగించుకొని ఎముకలని తయారుచేస్తుంది.
నీరు హానికరమైన రసాయనాలను తనలో విలీనం చేసుకొని మూత్రంతో కలిపి బహిష్కరిస్తుంది.
మాంసకృత్తులు జీర్ణం అయ్యే క్రమంలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను (Urea, Creatinine) మూత్రం ద్వారా విసర్జిస్తుంది.
జీవక్రియలు జరగటానికవసరమైన ఎంజైములు కరిగేందుకు నీరు కావాలి.
జీవ కణాల బయటి పొరలు సంకోచించటానికి, వ్యాకోచించటానికీ, బయటి ద్రవాలు లోపలికి, లోపలి ద్రవాలు బయటికీ ప్రవహించటానికి నీటిలో ఉండే (కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం) పరమాణువులు (అయాన్లు) తోడ్పడతాయి.
మనం తినే ఆహారంలో ఉండే “సోడియం క్లోరైడ్” (ఉప్పు) – సోడియం అయాన్లు గానూ, క్లోరిన్ అయాన్లు గానూ విడిపోయే “అయొనీకరణ” క్రియకు నీరు అవసరం. నీటిలో ఉప్పు కరగటం వలన ఈ క్రియ జరుగుతుంది.
నలభై సంవత్సరాలు దాటిన వారి శరీరంలో 70 శాతం, చిన్న పిల్లలలో 80 శాతం నీరు ఉంటుంది.
మృదు కణజాలంలో 70-80 శాతం, ఎముకల్లో 20 శాతం నీరు ఉంటుంది.
జీవ కణాలలో (Intra Cellular) 50 శాతం, కణాల బయట (Extra Cellular) 20 శాతం నీరు ఉంటుంది.
శరీరంలో నీటి లోపం ఏర్పడితే…?
విసర్జించిన పరిమాణానికనుగుణంగా లోపలికి నీరు వెళ్ళకపోతే రెండు మూడు రోజుల్లోనే శరీరం తీవ్రమైన “డీహైడ్రేషన్”కి గురవుతుంది. విసర్జించిన పరిమాణంలో తిరిగి శరీరం నీటిని నింపుకోలేకపోతే జీవకణాల లోపల ఉండే నీరు బయటకు వస్తుంది.
అందువలన మూత్రం తగ్గటం, శరీరం బరువు తగ్గటం, ఆ తర్వాత పరిమాణం తగ్గటం, గుండె పనిచేసే శక్తి తగ్గిపోవటం, రక్తప్రసరణ కూడా తగ్గిపోవటం – వగైరా సమస్యలు వస్తాయి.
శరీరం నుండి 5-10 లీటర్ల మధ్య నీరు బయటకు పోతే తీవ్రంగా వ్యాధిగ్రస్తులవటం, 15 లీటర్ల దాకా పోతే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది.
శరీరంలో నీరు ఒక శాతం తగ్గితే దాహం;
రెండు శాతం తగ్గితే విపరీతమైన దాహము, ఆకలి తగ్గిపోవటమూ వస్తాయి.
నాలుగు శాతం నీటి తగ్గుదలకు శరీరం కదలిక బాగా తగ్గిపోవటమూ ;
ఆరు శాతం తగ్గితే పాదాలు, చేతులలో వణుకు, తలనొప్పి, నడకలో తడబాటు, శరీర ఉష్ణోగ్రత, నాడి రేటు, ఊపిరి రేటు పెరగటం;
ఎనిమిది శాతం తగ్గితే మాట పడిపోవటం, ఊపిరి పీల్చటం కష్టం కావటం, తల, కళ్ళు తిరగటం, మతిభ్రమణం వస్తుంది.
పది శాతం నీటి లోపానికి కళ్ళు మూతలు పడి తెలివి తప్పటం, నాలుక తడి ఆరిపోయి మెలికలు తిరగటం, మూత్రం తయారీ ఆగిపోవటం జరుగుతుంది.
18 శాతం తగ్గుదలకు మ్రింగటం కష్టమై, చర్మం బీటలు వారటం, తిమ్మిరెక్కి ముడతలు పడటం, చెవుడు రావటం జరుగుతుంది. 20 శాతం లోపిస్తే ప్రాణాపాయ స్థితి వస్తుంది.
నీరు (water) ఎక్కువైతే ?
బయటకు పోయేది తక్కువై, లోపలికి వెళ్ళేది ఎక్కువైతే శరీరంలో నీరు నిలబడిపోయి కాళ్ళూ, చేతులూ, ముఖమూ వాపులు (Facial Oedema) రావటం, వాంతులూ, విరేచనాలూ తలనొప్పి, వికారమూ కదలికలలో సమన్వయ లోపమూ మొదలైన సమస్యలు వచ్చి ప్రాణాపాయ స్థితి రావచ్చు.
కాళ్ళపైన చర్మం మీద బొటన వేలితో నొక్కితే గుంటపడి (Pedal Oedema) అలానే ఉండిపోతుంది. నీళ్ళే విషంగా మారిందన్నమాట. ‘వాటర్ ఇన్స్టాక్సికేషన్” (Water Intoxication) అంటారు.
మూత్రపిండాలు పనిచేయకపోయినా, సిరల ద్వారా ఎక్కువ సెలైన్ని ఎక్కించినా, ఆపరేషను సమయంలో మత్తుమందు లిచ్చినప్పుడు యాంటీ – డయూరిటిక్ హార్మోన్ ఉత్పత్తి పెరిగినా, శరీరంలో నీరు నిలిచిపోయే అవకాశముంది.
నీటి అవసరం
శరీర నిర్మాణంలో నీరు ఒక ముఖ్యమైన భాగం. అంతే కాకుండా అనేక జబ్బుల నివారణకు, ఆ జబ్బులు వస్తే నయం చేసుకోవటానికి నీరు చాలా ముఖ్యమైంది.
జ్వరం వస్తే ఎక్కువ నీరు త్రాగాలి. జ్వరం తీవ్రత తగ్గడానికి తడిగుడ్డ వైద్యంలో నీరు ఉపయోగపడుతుంది. విరేచనాల జబ్బులో నీళ్ళు తీసుకోవడం చాలా అవసరం.
పాముకాటులోనూ, తేలు కుట్టినపుడూ, కాన్పు నొప్పులప్పుడూ విపరీతంగా చెమటలు పడతాయి. అక్కడ కూడా నీళ్ళు త్రాగడం చాలా అవసరం. ఎండలో పనిచేసేటపుడు, వడదెబ్బ తగిలినపుడు నీళ్ళు త్రాగాలి. నీటితో వళ్ళంతా తడపాలి.
మూత్రంలో చురుకు, మంట తగ్గడానికి నీళ్ళు ఎక్కువగా తాగాలి. కొన్ని మందులు వాడేటపుడు కూడా నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి.
మలబద్ధకం రాకుండా చేయడానికి, వస్తే వైద్యంలో భాగంగానూ మంచినీళ్ళు ఎక్కువగా త్రాగాలి.
ఆఖరికి జలుబు చేసినా కూడా నీళ్ళు చాలా ఎక్కువగా త్రాగాలి.
మనం త్రాగే నీరు కాకుండా శరీరంలోనికి, మనం తినే దోసకాయ, ఆనపకాయలు వంటి కూరగాయల, పండ్ల ద్వారా నీరు చేరుతుంది.
శరీరంలో జరిగే రసాయన క్రియలు కూడా నీటిని ఉత్పత్తి చేసి ఆ నీటిని శరీరానికి అందజేస్తాయి.
పట్టణాలలో రక్షిత నీటిని లేదా వడగట్టిన నీటిని సరఫరా చేస్తారు. కాని పల్లెలలో ఊట బావులలోని నీరు శ్రేష్ఠం. కాచి, చల్లార్చిన నీరు అంటువ్యాధులు ఉన్నప్పుడు వాడాలి.
మరిగిన నీరు (water) చప్పగా ఎందుకుంటుంది ?
నీళ్ళలో అనేక రకాల వాయువులు, ఖనిజ పదార్థాలు కరిగి ఉంటాయి. మనం నీళ్ళను మరిగించినప్పుడు కరిగి ఉన్న వాయువులన్నీ ఆవిరి రూపంలో, గాలిలో కలిసిపోతాయి. ద్రవ రూపంలో కరిగి ఉన్న బైకార్బొనేట్స్ విడిపోయి, కరగని కార్బొనేట్స్ గా మారతాయి. ఈ కార్బొనేట్స్ పాత్ర అడుగున, పక్క భాగంలోనూ తెట్టలా ఏర్పడతాయి. ఫలితంగా మరిగించినప్పుడు నీరు అందులోని సహజ వాయువుల్ని, ఖనిజ పదార్థాల్నీ కోల్పోతుంది. కాబట్టి రుచికి చప్పగా ఉంటుంది.
also read news:
Moral Stories in Telugu : జమిందారు – సాధువు