Telugu Flash News

Hong Kong bumper offer : పర్యాటకులకు హాంకాంగ్‌ బొనాంజా.. ఉచితంగా విమాన టికెట్లు!

Hong Kong free airline tickets news
Hong Kong free airline tickets news : ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం కోవిడ్‌ కారణంగా అతలాకుతలమైంది. మహమ్మారి వ్యాప్తితో సందర్శకులు ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
అయితే, ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ కరోనా తగ్గుముఖం పట్టడంతో పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. పర్యాటకులు నలుమూలల నుంచి తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ ఆస్వాదించడం మొదలు పెట్టారు. తాజాగా పర్యాటకుల కోసం హాంకాంగ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడం కోసం హాంకాంగ్‌ 5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. టూరిస్ట్‌లు, వ్యాపారవేత్తలను ఆకర్షించి ఫైనాన్షియల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఫ్రీ విమాన టికెట్లతో కూడిన ప్రమోషన్‌ను హాంకాంగ్‌ ప్రవేశపెట్టింది. ఈ క్యాంపెయిన్‌ను హాంకాంగ్‌లో శుక్రవారం మొదలు పెట్టారు. హలో హాంకాంగ్‌ పేరిట రీబ్రాండింగ్‌ ప్రచారాన్ని అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.

కోవిడ్‌ కారణంగా భారీగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు హాంకాంగ్‌ వినూత్న రీతిలో ప్రచారాన్ని చేపట్టింది. హాంకాంగ్‌ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ బిల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా నగర అందాలను అనుభూతి చెందేలా టూరిస్టుల కోసం 5 లక్షల ఉచిత విమాన ప్రయాణ టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.

వచ్చే నెల మార్చి నుంచి ఫ్రీ విమాన టికెట్లను సందర్శకులకు అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెల్‌కమ్‌ ఆఫర్‌గా ఇది నిలిచిపోతుందని హాంకాంగ్‌ నేత లీ.. ఈ స్కీమ్‌ ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించారు.

హార్బర్‌ పక్కనే ఉన్న మెయిర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో వివిధ రకాల డ్యాన్స్‌లు, నియోన్‌ లైట్ల వెలుగుల నడుమ ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించడం విశేషం. ఫారిన్‌ టూరిస్టులకు మార్చి ఒకటో తేదీ నుంచి ఆరు నెలల పాటు ఫ్రీగా విమాన టికెట్లు అందిస్తారు.

Exit mobile version