healthy food for kids : పిల్లలు ఆహారం తీసుకోవడానికి మారాం చేస్తుంటారు. ఇది చాలా ఇళ్లలో జరిగుతూ ఉంటుంది. ఆహారం తినడానికి బదులుగా పిల్లలు చాక్లెట్స్, జంక్ ఫుడ్స్, ఐస్‌క్రీమ్స్ తింటూ ఉంటారు. కూరతో కలిపిన అన్నం, ఆకుకూరలతో చేసిన కర్రీస్ తినడానికి చాలా మంది పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఈ నేపథ్యంలో తల్లులు వారికి సమతుల ఆహారం అందించలేక నానా అవస్థలు పడుతుంటారు. తమ బిడ్డకు సరైన పోషకాహారం అందుతోందా? లేదా అని నిత్యం మధనపడుతుంటారు.
ఈ క్రమంలో అసలు ఏ ఆహారం తీసుకుంటే పిల్లలకు పోషకాలు అందుతాయని చాలా మంది తల్లులకు అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తుంటారు. పిల్లల ఆహారం విషయంలో తల్లుల ఆవేదన, టెన్షన్ పోగొట్టేందుకు ప్రస్తుతం చాలా మంది వైద్యులు ఆన్లైన్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి సూచనలు, సలహాలను తల్లులు ఫాలో అవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది.
తల్లిదండ్రులు ప్రస్తుత జీవనశైలి కారణంగా గజిబిజి జీవితం గడుపుతుంటారు. నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతుంటారు. ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉండరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మీ నుంచే మీ పిల్లలు నేర్చుకుంటారని చెబుతున్నారు. పిల్లల వద్ద ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని, వారికి మంచి నడవడిక నేర్పాలంటున్నారు. తద్వారా వారు మంచి నిర్ణయాలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
ప్రత్యామ్నాయ ఫుడ్ ఇలా చేసుకోండి..
వంట చేసేటప్పుడు పిల్లలను భాగస్వామ్యం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారిలో ఆసక్తి పెరుగుతుంది. సింపుల్ సలాడ్స్, హెల్తీ స్వీట్ చేయడంలో సాయం చేయడం, రుచికరమైన ఫుడ్ వండటం, వృథాచేయకుండా అవగాహన కల్పించడం, పోషక విలువలున్న స్నాక్స్ తయారు చేసుకోవడం లాంటివి చేయడం వల్ల చిన్నారుల్లో తినడంపై ఆసక్తి పెరుగుతుంది. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా హోల్ వీట్ బ్రెడ్ వాడొచ్చు. ఫ్రూట్స్‌తో రకరకాల జ్యూస్‌లు, సలాడ్స్ చేసి తినిపించొచ్చు. కూల్ డ్రింక్స్‌కు బదులుగా ఫ్లేవర్డ్ వాటర్ ఇవ్వండి. ఇంట్లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలతో స్నాక్స్ చేయడం మంచిది.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు