Telugu Flash News

HAWA MAHAL : గాలిలో కట్టిన కోటలా ఉండే ‘హవామహల్’ గురించి మీకోసం..

Hawa mahal history in telugu

ఢిల్లీకి నైఋతి దిశలో 185 మైళ్ళ దూరంలో వున్న జైపూర్ నగరంలో వున్న ‘వాయు ప్రసాదం’ (Palace of the winds) గా ప్రసిద్ధి చెందిన హవామహల్ (HAWA MAHAL) జైపూర్ కి గుర్తింపు చిహ్నంగా చెప్పవచ్చు. ఇప్పుడు దీని ముందుభాగపు కట్టడం మాత్రమే నిలిచివున్నా, భారత ఉపఖండంలో ఎక్కువగా ఫొటోలు తీయ బడేది ‘హవామహ’లే.

అయిదంతస్తుల నిర్మాణమైన హవామహల్ అస్తమిస్తున్న సూర్యుని కిరణాలలోని ఎర్రదనంలో ఓలలాడినప్పుడు, జయ పూర్ నగరం మొత్తం పలుచటి ఎరుపు రంగుతో ఆచ్ఛాదితమై, సుతిమెత్తటి గులాబిరంగును ప్రకాశింపచేస్తుంది. దీనివల్లే రాజస్థాన్ రాజధాని అయిన జయపూర్ ‘పింక్ సిటీ ‘గా ప్రసిద్ధి చెందింది.

క్రీస్తుశకం 1727వ సంవత్సరంలో నిర్మించబడిన జయపూర్ నగరం భారతదేశ వాస్తు, నిర్మాణ కళకు కలికి తురాయిగా చెప్పవచ్చు. ఈ నగరంలో మామూలు ఇళ్ళు కూడా గోధుమవర్ణ అరుణ వర్ణంలోని ఇటుకలతో నిర్మించబడ్డాయి. దాని స్మృతిచిహ్న భవనం చూపరులను సుదూరగతంలోని భారత దేశాన్ని, దాని ప్రాభవాన్ని దర్శింపచేస్తాయి.

ఈ నిర్మాణాలకే ప్రాణం ఉంటే వేయినొక్క రాత్రుల కథలలో కూడా ఎక్కడా కని పించని ధైర్యసాహసాలు, మాతృభూమికోసం నవ్వుతూనే ప్రాణాల్ని బలిపెట్టిన రాజపుత్ర వీరుల మగటిమి, పరాయి పురుషుల నీడను కూడా సహించలేక అగ్నికి ఆహుతి అయిన రాజపుత్ర స్త్రీల శీలసంపదలాంటి, జాతికి, దేశానికి వన్నె తెచ్చిన అటువంటి సుగుణాలను, వాటికి సాక్షీ భూతంగా మారిన చరిత్రను కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తాయి.


ఇప్పటి జైపూర్ నగరంలో ప్రాచీననగరంగా పిలువ బడే, ఆనాటి జైపూర్ నగరంలోని మధ్య భాగంలో హవామహల్ ఉండి ఒకే ఒక ముఖతలం కలిగిన ‘హవామహల్’ నిర్మాణ కళా శిఖరాయమానంగా గాలిలో కట్టిన కోటలా గోచరిస్తుంది.

క్రీస్తుశకం 1799వ సంవత్సరంలో జయపూర్ ను పరిపాలించిన మహారాజు ప్రతాప్సింగ్ II తన సువిశాలమైన దేవకన్యల కథల భవనానికి చివరి శాఖగా దీనిని నిర్మింపచేశాడు. హవామ హల్ లోని అయిదు అంతస్తుల్లో ప్రతి అంతస్తు అలాభవనం మొత్తం ఒక్క గదిలోతుని మాత్రమే కలిగి వుంటుంది.

ఈ అయిదు అంతస్తులు తేనెపట్టులోని గదులలాగా ఒక దాని మీద ఒకటి అమర్చబడ్డాయి. ఈ మహల్లోని ప్రతి కిటికీకి రాతి ‘గ్రిల్’ బిగించబడి వుంటుంది. అలా అన్ని కిటికీల్లో నుంచి లోపలికి ప్రవేశించిన గాలి ఈ మహల్లో అంతా ప్రసారం అవుతూ చల్లదనాన్ని నింపుతుంది.

నిధి ఖజానా

మొత్తం 950 కిటికీలు, అరలతో ఈ మహల్ ముఖతలం చూడటానికి ఆడవాళ్ళు నగలు దాచి పెట్టుకొనే నగల పెట్టెగా, నిధి ఖజానాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పా లంటే నిధిఖజానా అని భావించటమే సబబుగా అనిపిస్తుంది.

ఈ ముందు ‘పోర్టికో’ నిజంగానే ఎన్నో నిధుల్ని పరాయివాళ్ళ కంటపడకుండా కాపాడటానికి నిర్మించబడింది. జాతి రత్నాలతో సరితూగే రాజపు మహారాణులు, రాజకు మారీలు నివసించటం కోసం నిర్మించబడిన రాణీవాసం అది.

పరాయిపురుషుడి కంటపడకుండా రాణీవాసం స్త్రీలు తమ నగరాన్ని, మహారాజావారి ఆడంబర నగర సందర్శనలను తిలకించటానికి ఇది ఎంతో అనువుగా నిర్మించబడింది. బయటి నుంచి మహల్లోకి రావటానికి ఏ మాత్రం అవకాశం లేని విధంగా ఈ అద్భుతమైన ముఖతలం రూపకల్పన చేయబడింది.

ఇది అనుబంధమై ఉన్న మహారాజ ప్రాసాదంలోని మిగిలిన భాగాల నుంచి మాత్రమే ఈ హవామహల్లోకి ప్రవేశించటానికి నిర్మాణ రీత్యా అవకాశం కల్పించబడింది. ఈ మహల్ కు వున్న 953 కిటికీలు, గూళ్లు, అరలు జైపూర్ మహారాజుల రాచరికపు దర్పానికి నిలువుటద్దం పడతాయి.

హవామహల్ కథలు

తమ ఉత్సవాలను జరుపుకొనటానికి జైపూర్ మహారాజులు ఎన్నుకొనే ఆడంబరం, నాటి పరిస్థితులు కూడా వారి వైభవాన్ని, ప్రాభవాన్ని చాటిచెప్తాయి. అనేక రకాలైన కథలు, గాథలు హవామహల్ చుట్టూ అల్లుకొని ఉన్నాయి.

ఒక గాథ ప్రకారం సవాయి జైసింగుకు చెందిన అంతు లేని సంపదను హవామహల్ పునాదుల్లో ప్రోదిచేసి హవామహల్ ను నిర్మించటం జరిగింది. ఇదే గాథ ప్రకారం హవామహలు నిర్మించిన మహా రాజు ప్రతాప్ సింగ్ II, తన జ్యోతిష్కుడు, నిర్మాణ శిల్పి అయిన లాద్ చంద్ ఉస్తా సలహామేరకు మహారాజు కిరీటంలోని అమూల్యమైన వజ్రాన్ని హవామహల్ కింద ఉన్న నేల మాళిగలో ఒక దానిలో భద్రంచేసి దానికి కాపలాగా ఒక నాగుపాముని అక్కడ ప్రతిష్టించటం జరిగిందని చెప్తారు.

ఆ నాగుపాము ఊపిరిని పీల్చినా ఒళ్ళంతా విషం కమ్ముకొని క్షణాలలోనే మృత్యువు సంభవిస్తుందని భావిస్తారు. బహుశా ఈ కారణం వల్లనేమో అనేక పాములను ఆడించేవారు హవామహల్ నీడలో వున్న అనేక వీధుల్లో పోగయి తమ పాముల్ని ఆడిస్తూ ఉంటారు.

Also Read :

Viral Video : బయటకొచ్చి తిందామని చూశాడు.. న్యూడుల్స్‌తో పాటు గడ్డకట్టుకుపోయాడు.. అట్లుంటది మరి.. కెనడాతోని!

Viral Video : క్యాన్సర్‌ రోగుల కోసం పెళ్లి కూతురు ఏం చేసిందో చూడండి.. మనసులు గెలిచింది!

Surendran K Patel : సాధారణ బీడీ కార్మికుడి నుంచి టెక్సాస్ లో జడ్జి స్థాయికి…

 

Exit mobile version