happy healthy new year 2023 : మరో సంవత్సరం ముగిసిపోయింది. కొత్త ఏడాది 2023 లో అడుగుపెట్టబోతున్నాం. ఎన్నో ఆశలతో ఉత్సాహంగా నూతన సంవత్సరాన్ని జరుపుకొని జీవితంలో మరో అడుగు ముందుకేయాలని అందరూ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని, కొత్త ఏడాది అంతా మంచి జరగాలని, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే, అందుకు తగిన ప్రణాళికలు కూడా రచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం విషయంలో కొత్త సంవత్సరంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాలని చెబుతున్నారు. చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వాటిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యం మీ దరిచేరాలంటే.. ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటమే కొత్త రెజల్యూషన్‌గా పరిగణించి మార్పులకు నాంది పలకాలి. పోషకాహారం తినడం, వ్యాయామం చేయడం తప్పనిసరిగా చేస్తామంటూ ఎవరికి వారు కృతనిశ్చయంతో నిర్ణయాలు తీసుకోవాలి.
అయితే, కొత్త నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన వెంటనే అమల్లోకి రావాలంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మెల్లగా ప్రయత్నిస్తే ఇది సాధ్యమే. కొత్త ఏడాదిలో వీలైనంత వరకు ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఉండేలా చూసుకోండి. సీజన్‌లో దొరికే పండ్లను మిస్ అవకుండా తినండి. పాలకూర, బచ్చలికూర, మెంతికూర, బ్రకోలీ, క్యాబేజీ వంటివి రోజువారీ ఆహారంలో భాగమయ్యేలా చేసుకోండి.
వీలైనంత వరకు ఫ్రెష్‌గానే తినండి..
ఆహారంలో ప్రాసెస్ చేసిన వాటి కంటే తాజా కూరగాయలు, ఫ్రెష్ ఐటమ్స్ తినడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వండి. మిగిలిపోయిన ఫుడ్ తినడం మానేయండి. బయటి ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో తయారు చేసుకున్న వాటినే తినండి. తినేటప్పుడు నోట్లో ప్రతి ముద్దనూ కనీసం 16 సార్లు నమిలి మింగాలని పెద్దలు చెబుతారు. అలాగే, కడుపులో 80 శాతానికి మించి ఆహారం తీసుకోరాదని పెద్దలు చెబుతున్నారు. దీని వల్ల కడుపులో కాస్త ఖాళీ ఉంటే తిన్న ఆహారాలు జీర్ణం కావడానికి సులభంగా ఉంటుంది.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు