Gujarat Road Accident : పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరంలోకి కోటి ఆశలతో ప్రవేశిస్తున్న తరుణంలో 9 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో మత్యువు కబళించింది. వేడుకలు జరుపుకొనే సమయంలో రక్తపాతం చోటు చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో బాధితకుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఉలిక్కడిపడినట్లవుతోంది.
ప్రయాణంలో ఒక్కసారిగా మృత్యువు కరాళనృత్యం చేస్తే ఎలా ఉంటుందో గుజరాత్‌లో జరిగిన ప్రమాదం కళ్లకు కట్టినట్లయింది. ఎదురుగా వస్తున్న కారు, బస్సు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా, మరో 28 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రం నవ్‌సరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అంక్లేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం వల్సాద్ నుంచి తమ సొంతూరుకి ఎస్‌యూవీ వాహనంలో బయల్దేరారు. మార్గంమధ్యలో నవ్‌సరి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఎస్‌యూవీ డ్రైవర్ వాహనంపై పట్టు విడిచాడు. దీంతో కారు నేరుగా డివైడర్‌ను దాటుకుని అవతలివైపు ఎదురుగా వస్తున్న సూపర్ లగ్జరీ బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది దుర్మరణంపాలయ్యారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.
అమిత్ షా దిగ్భ్రాంతి
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లగ్జరీ బస్సు సూరత్ నుంచి వల్సాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలకు సూచించారు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు