Telugu Flash News

Uma Harathi: ఎన్నో ఓటములు చూశా.. గెలుపుగా మార్చుకున్నా.. సివిల్స్‌ మూడో ర్యాంకర్ ఉమా హారతి

Uma Harathi: తాజాగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో మూడో ర్యాంక్‌ సాధించిన ఉమా హారతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫోకస్‌ అయ్యారు. ఎన్నో ఓటములు చవిచూశానని, వాటిపైనే గెలుపు తీరాలను చేరానని ఆమె పేర్కొంటున్నారు. తన టార్గెట్‌ సివిల్స్‌ అని, నాలుగు సార్లు ట్రై చేసినా ఫలించలేదన్నారు. అయితే, విసుగు చెందకుండా ధైర్యంతో పోరాడి ముందడుగేశానని.. ఐదో అటెంప్ట్‌లో యూపీఎస్సీ 2022 ఫలితాల్లో మూడో ర్యాంక్‌ కైవసం చేసుకున్నానని ఉమాహారతి వెల్లడించారు.

తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె అయిన ఉమాహారతి.. ఆల్‌ ఇండియాస్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించి అందరితో శభాష్‌ అనిపించుకున్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమినీ గెలుపులా మార్చుకోవాలని, విజయం సాధించాలని ఆమె పేర్కొన్నారు. మూడో ర్యాంక్‌ సాధించడంతో ఉమాహారతికి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీస్‌ అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి పెద్ద సంఖ్యలో అభినందన మందారమాల వెల్లువెత్తింది. ఎస్పీ వెంకటేశ్వర్లు తన కుమార్తె ఈ స్థాయిలో ర్యాంకు సాధిస్తుందని ఊహించలేకపోయారు.

ఉమా హారతి ప్రొఫైల్‌ విషయానికి వస్తే.. ఆమె పూర్తి పేరు ఎన్.ఉమాహారతి. తల్లి ఎన్.శ్రీదేవి, తండ్రి ఎన్.వెంకటేశ్వర్లు (ఐపీఎస్). ప్రస్తుతం ఆయన నారాయణపేట ఎస్పీగా కొనసాగుతున్నారు. ఉమాహారతికి తమ్ముడు ఎన్.సాయివికాస్‌ ఉన్నాడు. ప్రస్తుతం అతడు ముంబైలో జాబ్‌ చేస్తున్నాడు. వీరి సొంత ఊరు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌. ఉమాహారతి విద్యాభ్యాసం ఆరు నుంచి పదో తరగతి దాకా హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో కొనసాగింది. ఇంటర్‌ విద్య నారాయణ కాలేజీ, హైదరాబాద్‌లో, ఐఐటీ, బీటెక్‌ సివిల్‌ఇంజనీరింగ్‌ హైదరాబాద్‌లో చేశారు.

ఇక తన సాధనపై ఉమాహారతి స్పందిస్తూ.. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివేదాన్నని తెలిపారు. చదివినంతసేపు ఎంతో శ్రద్ధపెట్టేదానన్ని వెల్లడించారు. తనకు అమ్మ, నాన్న, తమ్ముడు ఎంతగానో సపోర్ట్‌ చేశారని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి ఐఏఎస్ మంచి వేదిక అని తన తండ్రి స్పూర్తి నింపాడని వెల్లడించారు. నాన్నపై ప్రేమతో ఐఏఎస్ కావాలని టార్గెట్‌ పెట్టుకొని మొత్తానికి సాధించానని ఉమాహారతి పేర్కొన్నారు. ఐఏఎస్‌గా మహిళలు, విద్యా రంగానికి ప్రాధాన్యి ఇస్తానని ఉమాహారతి తెలిపారు. ఈ సారి మంచి ర్యాంకు వస్తుందనుకున్నానని, ఊహించినట్లు కాకుండా మూడో ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు.

Read Also : Sai Varshith : ఎవరు ఈ సాయి వర్షిత్ ? అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను చంపాలని ఎందుకు అనుకున్నాడు ?

Exit mobile version