Telugu Flash News

US Visa : భారతీయులకు అగ్రరాజ్యం శుభవార్త.. ఈ ఏడాది 10 లక్షలకు పైగా వీసాలు!

us visa

US Visa News : మీరు వీసా కోసం ఎదురు చూస్తున్నారా? అందులోనూ అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? అయితే, ఇది మీకు గుడ్‌ న్యూస్. భారతీయులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేయాలని అమెరికా నిర్ణయించింది. అందులో భాగంగా కేవలం భారతీయులకు మాత్రమే 10 లక్షలకుపైగా వీసాలను అందించనున్నట్లు అమెరికా తెలిపింది. దీంతో వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది.

విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఇండియన్‌ స్టూడెంట్లందరికీ విద్యార్థి వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అమెరికా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇండియన్లు అధికంగా కోరుకొనే హెచ్‌1బీ, ఎల్‌ వర్క్‌ వీసాల జారీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు యూఎస్‌ పేర్కొంది. ఇదే అంశంపై అమెరికా విదేశాంఖ శాఖలో సహాయ కార్యదర్శిగా పని చేస్తున్న డొనాల్డ్‌ లూ వివరాలు వెల్లడించారు.

ఇండియా, యూఎస్‌ ఆర్థిక వ్యవస్థలకు అత్యంత ముఖ్యమైన వర్క్‌ వీసాల జారీకి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు డొనాల్డ్‌ లూ పేర్కొన్నారు. ఈ వీసాల జారీకి ఇండియాలో ఉన్న కొన్ని కాన్సులేట్‌లలో రెండు నెలల కన్నా తక్కువ సమయమే పడుతోందని ఆయన వివరించారు. నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాలు కొన్నింటిని పునరుద్ధరించుకొనేందుకు పిటిషన్‌దారు స్వయంగా హాజరు కావాల్సి ఉందని, అయితే, ఇలాంటి వాటిని దేశీయంగానే రెన్యువల్‌ చేసుకొనేందుకు వీలు కల్పించామన్నారు. ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్‌ లూ వెల్లడించారు.

ముఖ్యంగా హెచ్‌1బీ వీసాలు ఉండి ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ రంగ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవడానికి ఏం చేయాలో సూచనలు ఇస్తూ అమెరికన్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విధి విధానాలను రిలీజ్‌ చేసిందని ఆయన తెలిపారు. ఇండియా-యూఎస్ ద్వైపాక్షిక బంధాలను అమెరికాలో గొప్ప మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు గత 30 ఏళ్లుగా యూఎస్‌తో అనుబంధం ఏర్పరచుకున్నారని తెలిపారు. ఏటా సుమారు పది లక్షల మందికిపైగా ప్రజలు ఇరు దేశాల మధ్య ప్రయాణాలు సాగిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు లక్ష మంది దాకా అమెరికా వాసులు కూడా భారత్‌లో నివాసం ఉంటున్నారని డొనాల్డ్‌ లూ పేర్కొన్నారు.

also read :

Amritpal Singh Arrest : 35 రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌

Sarath Babu: సీరియస్‌గా ఉన్న శరత్ బాబు హెల్త్ కండీష‌న్… వెంటిలేట‌ర్‌పై చికిత్స‌..

Exit mobile version