Telugu Flash News

Mutton Canteen : నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 12 న తెలంగాణ మటన్‌ క్యాంటీన్‌ ప్రారంభం

mutton canteen

mutton canteen

Mutton Canteen : మటన్ క్యాంటీన్లను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి మటన్ క్యాంటీన్‌తోపాటు ప్రభుత్వ బిర్యానీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేపల క్యాంటీన్ విజయవంతం అయిన నేపథ్యంలో మటన్ క్యాంటీన్లను ప్రారంభించేందుకు గొర్రెల సమాఖ్య (షీప్‌ ఫెడరేషన్‌) సమాయత్తమవుతోంది.

మాసబ్‌ట్యాంక్‌లోని షీప్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మటన్ క్యాంటీన్‌ను ఈ నెల రెండో వారంలో ప్రారంభించనున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మటన్ క్యాంటీన్లను విస్తరించేందుకు సమాఖ్య సన్నాహాలు చేస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన మటన్ క్యాంటీన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మటన్ క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని గొర్రెల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్ తెలిపారు.

మటన్ క్యాంటీన్‌లో నాణ్యమైన మటన్ ఉత్పత్తులు, మటన్ బిర్యానీ, కీమా, తలకాయ కర్రీ, మటన్ టిక్కా తదితర మటన్ వెరైటీలను అందుబాటు ధరల్లో అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలు, మేకల సంపద పెరిగిన దృష్ట్యా నేరుగా మార్కెట్‌, ప్రాథమిక పెంపకందారుల సొసైటీలకు గొర్రెలను విక్రయించేందుకు కృషి చేస్తామన్నారు.

మటన్ క్యాంటీన్ల ఏర్పాటులో కురుమ, యాదవ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని బాల్‌రాజ్ వెల్లడించారు. క్యాంటీన్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పశుసంవర్థక శాఖ సంచాలకులు, గొర్రెల సమాఖ్య ఎండీ డాక్టర్‌ రామచందర్‌, అధికారులు డాక్టర్‌ శీనివాస్‌, డాక్టర్‌ వెంకటయ్యగౌడ్‌, డాక్టర్‌ సాయిరాజ్‌, టూరిజం శాఖ సాయిరాజ్‌, మత్స్య క్యాంటీన్‌ మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version