Telugu Flash News

Shakambari : ఆ దర్శనం అనిర్వచనీయం.. శాకంబరిగా భద్రకాళి అమ్మవారు

Shakambari : అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సాక్షాత్తు శక్తి స్వరూపిణి భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరే ఇతర అమ్మవారి ఆలయంలో లేని విధంగా భద్రకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం నాలుగు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నాలుగు ఉత్సవాల్లో ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు నిర్వహించే శాకంబరి ఉత్సవం అత్యంత విశిష్టమైనదిగా చెప్పుకుంటారు.

ఈరోజు ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి నాడు అమ్మవారి శాకంబరీ ఉత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. అమ్మవారికి రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, రకరకాల పండ్లతో అలంకరిస్తూ శాకములు ధరించిన అమ్మగా భద్రకాళి అమ్మగా దర్శనమిస్తుంది. ఆషాడ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరి ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.

Goddess Bhadrakali ammavaru is seen as Shakambari

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలికి చెందిన చావలి హనుమ కుమార్ బృందం వరంగల్‌లోని లక్ష్మీపురం, బాలసముద్రం మార్కెట్ నుండి కూరగాయలను సేకరించి, ఆలయ పూజారులు కలిసి అమ్మవారిని శాకంబరిరూపంలో అలంకరించారు. 1968 నుండి 7 సంవత్సరాల పాటు ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుంటే వర్షాలు సమృద్ధిగా కురవాలని శాకంబరి వేడుకలను ప్రారంభించారు.

కరువు కాటకాల నుంచి ప్రజలను రక్షించి, వర్షాలు కురిసి సుఖ సంతోషాలతో జీవించేందుకు భద్రకాళి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త బీఎస్ గణేష్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలిసారిగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున శాకంబరీ ఉత్సవం నిర్వహించారు. ఆ తర్వాత వర్షం కురిసి అందరూ ఆనందంగా జీవించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం భద్రకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి.

శాకంబరి ఉత్సవానికి ఐదు టన్నుల కూరగాయలతో అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు మహిళా భక్తులు కూరగాయలు, ఆకు కూరలతో మాలలు చేసి భక్తిపారవశ్యాన్ని చాటుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భద్రకాళిని ఆ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో శాకంబరి రూపంలో భక్తులకు భద్రకాళి అమ్మవారు దర్శనం ఇచ్చారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణం భద్రకాళి నామస్మరణతో మారుమోగింది. భద్రకాళి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో భారతి ఆధ్వర్యంలో సిబ్బంది విజయ్, శ్యామ్ తదితరులు భక్తుల సహకారంతో చర్యలు చేపట్టారు.

ఇప్పటికే చలువ పందిళ్ళు వేయగా మంచినీటి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, ఇతర అర్చకుల ఆధ్వర్యంలో భక్తులకు భద్రకాళి దర్శనం కోసం తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

భక్తులకు భద్రకాళి అనుగ్రహం లభించేలా కృషి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అక్కడక్కడ చిన్నచిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని పట్టించుకోకుండా భక్తులు భద్రకాళిని దర్శించుకున్నారు.

 

read more :

Rukmini : రుక్మిణీ దేవి ప్రత్యేకత ఏమిటి? భక్తులు ఆమెను ఎందుకు ఎక్కువగా పూజిస్తారు?

 

 

Exit mobile version