అదానీ వ్యవహారంలో కేంద్రంపై ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ పెట్టుబడిదారు జార్జ్ సోరస్ (George Soros) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పట్టును బలహీన పరిచే అవకాశం ఉందని సోరస్ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సోరస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జార్జ్ సోరస్‌ను పక్షపాతి అంటూ జైశంకర్ వ్యాఖ్యానించారు. జర్మనీలోని మ్యూనిక్‌లో భద్రత సదస్సులో సోరస్ ప్రసంగిస్తూ.. మోదీ, అదానీల భవితవ్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయన ప్రసంగాన్ని తప్పుపట్టారు. శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన చర్చల్లో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోరస్ ధనికుడు, వృద్ధుడని వ్యాఖ్యానించారు. ఆయన అత్యంత ప్రమాదకారి అని చెప్పారు. మూర్ఖమైన అభిప్రాయాలున్న వ్యక్తిగా అభివర్ణించారు.
న్యూయార్క్‌లో కూర్చొని తన అభిప్రాయాల ప్రకారమే ప్రపంచమంతా నడుచుకోవాలని ఇప్పటికీ అనుకుంటారంటూ సోరస్‌ను ఉద్దేశించి జైశంకర్ వ్యాఖ్యానించారు. లక్షల మంది ముస్లింల పౌరసత్వంపై భారత్ వేటు వేయబోతోందని.. ఇదే సదస్సులో కొన్నేళ్ల క్రితం సోరస్ ఆరోపించిన విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు. అలా లక్షల మందిని భయపెట్టే ప్రయత్నం చేయడం వల్ల సామాజిక కూర్పునకు భారీనష్టం వాటిల్లుతుందని, సోరస్ తీరు ఎంతమాత్రం సరికాదని జైశంకర్ ఘాటుగా స్పందించారు.
మోదీ అదానీ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పార్లమెంటులో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. అయితే, వీటన్నింటికీ ప్రధాని మోదీ సమాధానం చెప్పకుండా కేవలం తన పాలనలో ఏం చేశామో వివరిస్తూ పార్లమెంటులో ప్రసంగం చేయడం విశేషం. తాజాగా సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణ జరిగింది. అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సీల్డ్ కవర్ సలహాలు అక్కర్లేదని సుప్రీం కుండబద్ధలు కొట్టింది. తామే ఓ కమిటీని నియమిస్తామని స్పష్టం చేసింది.
also read :
Rashmi Gautham: తనకి కాబోయే వాడెవడో రష్మీ గౌతమ్ చెప్పేస్తుందా ?
YS Sharmila: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. షర్మిల అరెస్టు, పాదయాత్ర క్యాన్సిల్!