Rishabh Pant: బంగ్లాదేశ్ పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన పంత్.. ఇంటికి వెళ్తుండగా డెహ్రాడూన్ సమీపంలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనికి మంచి చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం పంత్‌ను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తరలించగా, అతనికి ఈ ఆస్పత్రిలోనే మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని బీసీసీఐ వెల్లడించింది. అయితే పంత్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఐపీఎల్ ఆడతాడా అని అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ అప్‌డేట్ ఇచ్చాడు.
వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా గంగూలీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంగూలీ నుంచి పంత్ గురించి అప్‌డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. తను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో టచ్‌లో ఉన్నట్లు గంగూలీ వెల్లడించాడు. ‘నేను ఢిల్లీ క్యాపిటల్స్‌తో టచ్‌లో ఉన్నా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, రిషభ్ పంత్ ఈ ఐపీఎల్ ఆడటం లేదు. జట్టుకు మాత్రం మంచి సీజన్ లభిస్తుందని అనుకుంటున్నాను. అయితే రిషభ్ పంత్ ఇలా గాయపడటం మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ మీద చాలా ప్రభావం చూపుతుంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. అంతకుముందు 2019లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అడ్వయిజర్‌గా ఉన్న గంగూలీకి రిషభ్ పంత్‌తో మంచి అనుబంధం ఉంది.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాతే గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు మళ్లీ ఆ జట్టుతో కలుస్తున్నాడు. ఇక పంత్ విషయానికి వస్తే ఐపీఎల్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీతోనే పంత్ అరంగేట్రం చేశాడు. 2021లో ఆ జట్టు సారధిగా రాణించిన పంత్.. జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లగలిగాడు. అయితే గతేడాది మాత్రం ఆ ఫీట్ సాధించలేకపోయాడు. త్రుటిలో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ ఏడాది నుంచి పంత్‌ను ఓపెనర్‌గా పంపుతారని అంతా అనుకున్నారు. అయితే ఇలా ప్రమాదం జరగడంతో ఆ టీం ఇప్పుడు కన్ఫ్యూజన్‌లో పడింది.