Telugu Flash News

H1B Visa : హెచ్‌1బీ వీసా లాటరీలో మోసాలు.. హెచ్చరించిన అమెరికా!

h1b visa

H1B Visa : హెచ్‌1బీ వీసా లాటరీల్లో మోసాలు చోటు చేసుకుంటున్నాయని అమెరికా హెచ్చరించింది. వీసా దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పద్ధతిని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా పేర్కొంది.

ఈ మేరకు మోసాలు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయని పౌరసత్వ, వలస సేవల డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటన జారీ చేసింది. 2023-24కు సంబంధించి హెచ్‌1బీ వీసా సీజన్‌లో లభ్యమైన ఆధారాల ప్రకారం ఇప్పటికే జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

మోసాలపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టామని ప్రకటనలో అమెరికా తెలిపింది. అయితే, ఇందులో క్రిమినల్‌ విచారణకు సంబంధించిన న్యాయ ప్రక్రియను కూడా ప్రారంభించామని పేర్కొంది. ఒకే లబ్ధిదారుడి తరఫున చాలా రిజిస్ట్రేషన్లు సబ్‌మిట్‌ చేసి కొన్ని సంస్థలు లాటరీ విధానంలో అయాచితంగా లబ్ధి పొందేందుకు పథకం రచించాయని, ఇది కుట్రపూరిత నేరంగా భావిస్తున్నట్లు పౌరసత్వ, వలస సేవల విభాగం స్పష్టం చేసింది.

హెచ్‌1బీ వీసాల కోసం ఈ సంవత్సరం కంప్యూటర్‌ ఆధారంగా లాటరీలో 7 లక్షల 80 వేలా 884 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపింది. వాస్తవానికి 2023 ఏడాదికి సంబంధించి ఈ సంఖ్య 4 లక్షల 83 వేల 927గా ఉంది. 2022లో ఈ సంఖ్య 3 లక్షల ఒక వెయ్యి 447. ఇక 2021లో ఈ సంఖ్య 2 లక్షల 74 వేల 237 మాత్రమే.

ఇలా ఇంతకుముందు దరఖాస్తుల సంఖ్య ఉండేది. అయితే, ఈ ఏడాది 4 లక్షల 8 వేల 891 మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు లాటరీ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం వెల్లడించింది.

గతేడాది ఈ సంఖ్య 1,65,180 మాత్రమేనని పేర్కొంది. అంతకుముందు ఏడాది 90,143గా ఉండేది. అమెరికాలోని సంస్థలు తమ ఉద్యోగులకు వీసాలు రావాలనే దురుద్దేశంతో ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయని పేర్కొంది. ఇలా చేయడం మోసగించడమే అవుతుందని తెలిపింది.

ఇలాంటి లోపాలను సరిదిద్దుతామని, మోసాలను అరికడతామని స్పష్టం చేసింది. తాజాగా వెలుగు చూస్తున్న మోసాలపై ఉపేక్షించేది లేదని తెలిపింది. లాటరీ విధానంలో తమ విదేశీ ఉద్యోగుల అవకాశాలను కృత్రిమంగా పెంచుకునేందుకు కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపింది. హెచ్‌-1బీ వీసా జారీ విధానాన్ని ఆధునికీకరణ చేసే నిబంధనపై చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE  

 

Exit mobile version