ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్, చరిత్రలోనే మేటి ఆటగాడిగా పేరుగాంచిన పీలే (Football Legend Pele) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సావోపాలో లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బ్రెజిల్‌కు చెందిన 82 ఏళ్ల ఈ ఆటగాడు.. గత ఏడాదే క్యాన్సర్ బారిన పడ్డాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ చివరకు గురువారం అర్ధరాత్రి మృత్యు ఒడికి చేరుకున్నాడు పీలే.
సాకర్ వార్‌లో ప్రపంచంలోనే అత్యంత మేటి ఆటగాడిగా పీలే పేరుగాంచారు. ఏకంగా మూడు ప్రపంచకప్‌లు నెగ్గిన జట్టులో భాగస్వామిగా పీలే ఉన్నాడు. తన అద్భుతమైన ఆట తీరుతో బ్రెజిల్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల ఆదరణను పొందాడు పీలే. సుమారు రెండు దశాబ్దాలకు పైగా సాకర్ వార్‌లో ఉర్రూతలూగించి అలరించాడు. తన తరంతోపాటు ఫుట్‌బాల్ సమరం చరిత్రలోనే తనదైన గుర్తింపు పొందిన మేరునగధీరుడిలా పీలే ఖ్యాతి తెచ్చుకున్నాడు.
పీలే ఆటలో ప్రత్యేకత ఉంటుంది. తన ప్రదర్శనతో బ్రెజిల్‌ను మరోస్థాయికి చేర్చాడనడంలో సందేహం లేదు. ఏకంగా నాలుగు ప్రపంచకప్‌లలో ఆడిన పీలే.. 1958, 1962, 1970 సంవత్సరాల్లో ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఫుట్‌బాల్ ఆడేటప్పుడు అతని కదలికలు మెరుపువేగంగా ఉంటాయి. ఫార్వర్డ్, అటాకింగ్ మిడ్ ఫీల్డర్‌గా చిరుతకంటే వేగంగా కదలడం పీలే స్పెషాలిటీ. అందుకే అతడి ఆటంటే అభిమానులు భారీ సంఖ్యలో ఎదురు చూపులు చూస్తుంటారు.
చరిత్రలో గుర్తుండిపోయే ఘటనలెన్నో..
మైదానంలో అడుగుపెట్టాడంటే బంతిని రెండు కాళ్లతో మైమరపించేలా, ప్రత్యర్థి జట్టు సభ్యులు చూస్తూ ఉండిపోయేలా అతని కదలికలు ఉంటాయి. పీలే చరిత్రకు గుర్తుగా ఫీఫా అధికారిక ఛానల్‌లో పీలే టాప్ 5 గోల్స్‌ను ఉంచింది. ఇవి చూసిన అభిమానులకు అతడి ప్రతిభ ఏంటో తెలిసిపోతుంది. 1970 ప్రపంచకప్‌లో రొమేనియాతో పోరులో దాదాపు 25 గజాల దూరం నుంచి ఫ్రీకిక్‌ను.. డిఫెండర్ల మధ్యలో నుంచి గోల్‌పోస్టులోకి చేర్చే తీరు అత్యద్భుతం. ఈ సీన్లో పీలే కళ్లు చెదిరేలా గోల్ చేస్తాడు. 1958 ప్రపంచకప్‌లో పీలే తీవ్రమైన మోకాలి గాయంతో ఇబ్బందిపడుతూనే అత్యుత్తమంగా రాణించి అవార్డు కూడా అందుకున్నాడు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా ఉండిపోయింది. ఇక 1971 జూలైలో యుగోస్లేవియాతో చివరి మ్యాచ్ ఆడాడు పీలే. ఫుట్‌బాల్ క్రీడకే గుర్తింపు తెచ్చిన పీలే మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు