Supreme Court : పార్లమెంటు శాసన నిర్మాణాధికారాల్లో కోర్టులు ఎంత వరకు జోక్యం చేసుకోగలవంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్వలింగ వివాహాల కేసు విచారణలో భాగంగా న్యాయవాదులను రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ప్రశ్నించింది.
స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు గుర్తింపు ఇవ్వడం అనేది ప్రత్యేక వివాహ చట్టం 1954 వరకు పరిమితం అయ్యే అంశం కాదని పేర్కొంది. పర్సనల్ లా కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇద్దరు మగవారు లేదా, మహిళల మధ్య జరిగే పెళ్లిళ్లకు గుర్తింపు ఇచ్చాక వారికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని పేర్కొంది. దత్తత, వారసత్వ హక్కులతో పాటు పింఛను, గ్రాట్యుటీ, ప్రమాద బీమా చెల్లింపులకు న్యాయబద్ధమైన లబ్ధిదారుల గుర్తింపు లాంటి అంశాల్లో అనేక ప్రశ్నలు ఎదురవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి పర్సనల్ లాను వర్తింపజేయాల్సి రావొచ్చని ధర్మాసనం తెలిపింది. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట తాజాగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ప్రశ్నలను అడిగింది.
స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత ఇచ్చేందుకు పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి వివాదం లేదని ధర్మాసనం పేర్కొంది. అలాంటి పరిస్థితుల నడుమ ధర్మాసనం తన అధికారాన్ని వాడుకోవడానికి ఉన్న అవకాశం ఏంటని న్యాయవాదులను ప్రశ్నించింది.
దాని పరిధులు ఏంటి? ఈ అంశంపై కోర్టు ఎంత వరకు జోక్యం చేసుకోగలదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసింది. ఇక పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు సౌరభ్ కిల్పాల్, మేనకా గురుస్వామి, గీతా లూథ్రా, కె.వి.విశ్వనాథన్ తమ వాదనలు ధర్మాసనానికి వినిపించారు.
వ్యక్తుల ప్రైమరీ రైట్స్ ఉల్లంఘనకు గురవుతుంటే ధర్మాసనం మెట్లు ఎక్కే అర్హత ఉంటుందని మేనకా గురుస్వామి వాదించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. 1997 నాటి విశాఖ తీర్పును ఆయన ఉదహరించారు.
వర్క్ ప్లేస్‌లో లైంగిక వేధింపులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను అత్యున్నత ధర్మాసనం రూపొందించగా అది చట్టం తీసుకొచ్చేందుకు దోహదపడిందని వివరించారు. శాసన నిర్మాణంలో కోర్టు ప్రమేయానికి ఇదొక మంచి ఉదాహరణగా ఆయన వెల్లడించారు. కానీ, చట్టాల రూపకల్పనలో కోర్టు ఎంత వరకు జోక్యం చేసుకోగలదని ఆయన ప్రశ్నించారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE